
Tesla: ప్రముఖ ఎలక్ట్రిక్ ఆటోమేకర్ టెస్లా భారత్‌లో ఎంట్రీకి సిద్ధమవుతోంది. వచ్చే ఏడాది నుంచి దేశంలోకి టెస్లా కార్లను దిగుమతి చేసుకునే దిశగా భారత ప్రభుత్వం, టెస్లా మధ్య ఒప్పందం చివరిదశకు చేరుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరో రెండేళ్లలో భారత్‌లో ప్లాంట్ ఏర్పాటుకు టెస్లా సిద్ధమవుతోంది. భారత్‌లో కొత్త ప్లాంట్ కోసం టెస్లా ఏకంగా 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడులో ఏదో ఒక రాష్ట్రంలో ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది. జనవరిలో జరగనున్న వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమ్మిట్‌లో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే భారతీయులకు అందుబాటు ధరలో టెస్లా ఈవీ కార్‌ని తీసుకువస్తున్నట్లు సమచారం. ప్రస్తుతం టెస్లా అత్యంత సరసమైన ధర కలిగిన కార్ మోడల్‌ని జర్మనీలో రిలీజ్ చేసింది. రెండు డోర్లు ఉంటే ఈ కార్ విలువ 25,000 యూరోలుగా ఉంది. అంటే మన భారత కరెన్సీలో సుమారుగా రూ. 22 లక్షలు. ఇదే మోడల్ కారు భారత దేశంలో లాంచ్ చేసే అవకాశం ఉంది.
Read Also: Iceland: ఏ క్షణమైన బద్ధలవనున్న అగ్నిపర్వతం.. ఐస్‌లాండ్ హెచ్చరిక..
బిలియనీర్ ఎలాన్ మస్క్ సంస్థ అయిన టెస్లా తన భారత మార్కెట్‌లోకి రంగ ప్రవేశం వచ్చే ఏడాది ఉండనుంది. అయితే దీనిపై టెస్లా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. కొన్ని మోడళ్లను దిగుమతి చేయనుంది. అయితే ఇప్పటి వరకు అవి ఏ మోడళ్లనే విషయాన్ని వెల్లడించలేదు. అయితే మోడల్Y భారత దేశంలో లాంచ్ అయ్యే మొదటి మోడల్ అనే సమాచారం ఉంది. మోడల్ Y కార్. మోడల్ 3 సెడాన్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. మిడ్ సైజ్ క్రాస్ ఓవర్ SUV అయిన ఈ కారు 2020లో టెస్లా లాంచ్ చేసింది. ఇది మోడల్ xతో పోలిస్తే తక్కువ ఖరీదు, చిన్నదిగా ఉంటుంది.
ప్రస్తుతం ఈవీ కార్ మార్కెట్‌లో ఇండియాలో టాటా అగ్రగామిగా ఉంది. టాటా నుంచి నెక్సాన్, టిగోర్, టియాగో ఈవీలు ఉన్నాయి. వీటితో పాటు కాంపాక్ట్ ఎస్‌యూవీ పంచ్‌ని కూడా ఈవీ సెగ్మెంట్‌లో తీసుకురాబోతోంది. ఇండియా వ్యాప్తంగా ఎక్కువగా అమ్ముడవుతున్న టాటా నెక్సాన్ ఈవీ కార్ ధర ప్రస్తుతం రూ. 14.74-19.94 లక్షలు(ఎక్స్ షోరూం) గా ఉంది. ప్రస్తుతం ఇండియన్ కార్ మేకర్స్ అయిన టాటా, మహీంద్రాలు ఈవీలపై దృష్టిపెట్టాయి. ఒక వేళ టెస్లా ఇండియన్ మార్కెట్లోకి వస్తే ఈ సెగ్మెంట్‌లో రాజుగా ఉన్న టాటాను ఢీకొట్టాల్సి ఉంటుంది.