Leading News Portal in Telugu

Israel-Hamas War: గాజా సంధిలో భారత్ సాయం కోరనున్న ఇస్లామిక్ దేశాలు..



Israel Hamas War

Israel-Hamas War: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం, సంధి కోసం ఇస్లామిక్ దేశాలతో పాటు ప్రపంచ దేశాలు పిలుపునిస్తున్నాయి. అక్టోబర్ 7నాటి దాడి తర్వాత ఇజ్రాయిల్ గాజాపై విరుచుకుపడుతోంది. 23 లక్షల జనాభా ఉన్న అత్యంత రద్దీ ఉన్న ప్రాంతంపై దాడులు చేయడం వల్ల అక్కడ 13 వేల మంది పాలస్తీనియన్లు చనిపోయారు. అయితే వీరిలో 5 వేల మంది వరకు చిన్నారులు ఉండటంపై అన్ని దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో సంధి కోసం భారత్ సాయం కోరేందుకు పవర్ ఫుల్ ఇస్లామిక్ దేశాల ప్రతినిధి బృందం మన దేశాన్ని సందర్శించనున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఖతార్, జోర్డాన్, పాలస్తీనా, ఇండోనేషియా విదేశాంగ మంత్రులతో కూడిన ప్రతినిధి బృందంతో పాటు ఐఓసీ జనరల్ సెక్రటరీ గాజాపై చర్చించడానికి భారతదేశాన్ని సందర్శించనున్నట్లు తెలిసింది. గాజా సంక్షోభంపై చొరవ తీసుకునేందుకు రియాద్‌లో ఏర్పాటు చేసిన అరబ్, ఇస్లామిక్ దేశాలకు చెందిన ఏడుగురు సభ్యుల ప్రతినిధి బృందం భారత్‌తో పాటు P5 దేశాలను సందర్శించనున్నారు.

Read Also: Tesla: భారతీయులకు అందుబాటు ధరలోనే టెస్లా కారు.. ధర ఎంతంటే..?

అయితే ఇప్పటి వరకు వారి తేదీలు ఖరారు కాలేదు. ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఖతార్, జోర్డాన్, పాలస్తీనా, ఇండోనేషియా విదేశాంగ మంత్రులు మరియు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (OIC) ప్రధాన కార్యదర్శి ప్రతినిధి బృందంలో ఉన్నారు. ఐక్యరాజ్యసమితిలోని శాశ్వత సభ్యదేశాలైన యూఎస్, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలను పీ5 దేశాలుగా పిలుస్తారు. కాల్పుల విరమణ, గాజాపై శతృత్వానని వీడేలా ఇజ్రాయిల్‌ని ఒప్పించాలనీ పీ5 దేశాలతో పాటు ఇండియాను కోరనున్నారు.

ఇటీవల సౌదీ రాజధాని రియాద్‌లో ఇస్లామిక్ దేశాలు నవంబర్ 11న భేటీ అయ్యాయి. ఈ సమావేశంలో ఇజ్రాయిల్‌పై చర్యలు తీసుకోవాలని ఇరాన్ సభ్యదేశాలను కోరింది. ప్రతినిధి బృందం చైనాలో పర్యటించి, ఈ యుద్ధాన్ని నిలపుదల చేయాలని కోరింది. ఈ పర్యటన తర్వాత రష్యాలో పర్యటించిన బృందం, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌తో సమావేశమైంది. పౌరుల రక్షణ, మానవతా కారిడార్లు, బందీల విడుదలపై చర్చించారు.