posted on Nov 23, 2023 9:06AM
రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దృశ్యం. అధికార పార్టీ పట్ల జనం వైముఖ్యం. రాష్ట్రంలో అధికార వైసీపీ ఏ కార్యక్రమం చేపట్టినా జనం ముఖం చేటేస్తున్న వైనం. బెదరింపులు, బుజ్జగింపులకు సైతం లొంగని జనం. ఎక్కడ చూసినా ఆదే పునరావృతం. గడపగడపకూ అన్నా, వై ఏపీ నీడ్స్ జగన్ అంటూ జనంలోకి వచ్చినా, చివరాఖరికి ఇప్పుడు సామాజిక బస్సు యాత్ర అంటూ వచ్చినా ప్రజలు మాత్రం మీ మాటలు వినం.. మీ హామీలను నమ్మం, మీ కార్యక్రమాలకు రాం అనే అంటున్నారు. తాజాగా ఒంగోలులో జరిగిన సామాజిక బస్సు యాత్రలోనే ఇదే దృశ్యం ఆవిష్కృతమైంది. జనం స్పందన కరవైంది. కష్టపడి, బెదరించి జనాలను తీసుకువచ్చినా.. నేతల ప్రసంగం మొదలు కాకుండానే వారు వెనుదిరిగారు. నాయకులు బతిమలాడినా ఫలితం లేకుండా పోయింది.
జనాలను బలవంతంగా వాహనాలలో తరలించారు. డ్వాక్రా గ్రూపులను తీసుకువచ్చి బలప్రదర్శన చేయడానికి శతథా ప్రయత్నించిన నేతలకు నిరాశే ఎదురైంది. మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే, వైసీపీలోనే రెబల్ గా ఇప్పడిప్పుడే ముద్ర పడుతున్న బాలినేని శ్రీనివాసరావు అయితే పార్టీ అధిష్ఠానానికి మరీ ముఖ్యంగా జగన్ కు తన బలం ప్రదర్శించేందుకు ఒక విధంగా బ్రహ్మ ప్రయత్నమే చేశారు. పెద్ద సంఖ్యలో డ్వాక్రా మహిళలను బస్సుయాత్ర సభ కోసం తరలించారు. డ్వాక్రా మహిళలు బస్సు యాత్ర కార్యక్రమానికి రావడమే కాకుండా వారి ఆధార్ కార్డుతో ఫొటో దిగి గ్రూపులో పెట్టాలని ఆదేశాలు కూడా ఇచ్చారు. సరే ఆయన హెచ్చరికలకు భయపడో, మాజీ మంత్రి కదా అన్న మొహమాటంతోనో పెద్ద సంఖ్యలోనే జనాలు వచ్చారు. అయితే అబ్బో జనాన్ని బాగా సమీకరించగలిగామన్నఆనందం వైసీపీ నేతలకు క్షణం కూడా మిగలలేదు.
ఇలా నేతల ప్రసంగాలు మొదలయ్యాయో లేదో అలా జనం వెళ్లిపోయారు. దీంతో బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేసి పెద్ద సంఖ్యలో కుర్చీలు వేసి ఆర్భాటం చేసిన నేతలు.. చివరకు ఖాళీ కుర్చిలను ఉద్దేశించి ప్రసంగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ పరిస్థితి ఒక్క ఒంగోలుకే పరిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర తుస్సు మంది. జనమే కాదు, పార్టీ కార్యకర్తలు కూడా మొహం చాటేశారు.
ఎస్సీ, ఎస్టీలకు అమల్లో ఉన్న 27 పథకాలను రద్దు చేసి.. ఉప ప్రణాళిక నిధులను దారి మళ్లించిన వైసీపీ సర్కార్ మంత్రులతో సామాజిక అంటూ మంత్రులను పంపి బస్సుయాత్రలు నిర్వహిస్తుంటే జనం నవ్వుకుంటున్నారు. ఒంగోలులో అయితే సొమ్ములిచ్చి మరీ తీసుకువచ్చారని చెబుతున్నారు. వేల కుర్చీలు వేసి ఆర్భాటం చేశారు. తీరా సభ ప్రారంభం అయ్యీ అవ్వకుండానే జనం వెళ్లిపోవడం ప్రారంభించడంతో కంగుతిన్న వైసీపీ నేతలు సభా ప్రాంగణం నుంచి ఎవరూ వెళ్లిపోకుండా తమదైన శైలిలో ప్రయత్నాలు చేశారు. అవీ విఫలమయ్యాయి. ఫ్లెక్సీలను చించుకుని, పడేసి మరీ దారి చేసుకుని సభ నుంచి జనం తరలి వెళ్లిపోయారు. సభ ఆరంభం అయ్యే సమయానికి నిండుగా జనంతో కనిపించిన ప్రాంగణం.. సభ ఆరంభమైన నిముషాల వ్యవధిలోనే దాదాపు ఖాళీ అయిపోయింది. విశాఖ దక్షిణ నియోజకవర్గంలోనూ, బనగానపల్లిలోనూ కూడా దాదాపుగా ఇలాంటి దృశ్యాలే కనిపించాయి.