Vizag Fishing Harbour Accident: ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం.. బాధితులకు రూ.7.11 కోట్ల పరిహారం పంపిణీ..

Vizag Fishing Harbour Accident: విశాఖ ఫిషింగ్ హార్బర్లో అగ్నిప్రమాదం తీవ్ర కలకలం రేపింది.. ఈ ప్రమాదంలో బోట్లు తగలడడంతో తీవ్ర నష్టం కలిగింది.. అయితే, బోట్ల యజమానులకు ఈ రోజు పరిహారం పంపిణీ చేశారు.. 49 బోట్లకు రూ.7.11 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన విషయం విదితమే కాగా.. ఈ రోజు మత్స్యకారులకు పరిహారం పంపిణీ చేశారు మంత్రులు సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్.. ఇక, ఈ కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి, మోపిదేవి వెంకట రమణ, ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా మరికొందరు నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ.. అగ్నిప్రమాదంలో నష్టపోయిన బోట్ల స్థానంలో లాంగ్ లైనర్లు సమకూర్చు కోవడానికి ప్రభుత్వం సహకరిస్తుంది.. 75 శాతం సబ్సిడీ ఇచ్చేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉంది అని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో మత్సకారుల డీసెల్ బకాయిలు కూడా చెల్లిస్తాం. త్వరలో 4 కోట్లు 15 రోజుల్లో విడుదల చేయమని సీఎం ఆదేశించారని తెలిపారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదాన్ని కొందరు రాజకీయం చేయడానికి ప్రయత్నించారు.. పరిహారం ఇస్తున్న దశలో సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేయించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా అర్హులకు పరిహారం ఇవ్వాలని ఆదేశించారని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా విలువలో 80 శాతం చెల్లింపు చేయాలని చెప్పారు. కలాశీలకు పది వేలు చొప్పున పరిహారం ఇవ్వాలని సీఎం చెప్పారని.. ఇప్పుడు దాదాపు 400 మంది కలాశీలకు మేలు జరుగుతోందన్నారు. మరోవైపు, ఫిషింగ్ హార్బర్ ఆధునీకరణకు ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. త్వరలో జీరో జట్టీ ఆధునీకరణకు ఆదేశాలు ఇచ్చారు.. ఇప్పుడు రాజకీయాలకు తావు ఇవ్వకండి అని విజ్ఞప్తి చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు.
ఇక, రాజ్య సభ సభ్యలు మోపిదేవి వెంకట రమణ మాట్లాడుతూ.. ప్రకృతి వైపరీత్యంతో ప్రమాదాలు మత్స్యకారులకు సహజం.. విశాఖ హార్బర్ ప్రమాదం మానవ తప్పిదం.. కానీ, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఉదారత చాటుకున్నారని ప్రశంసించారు. గత ప్రభుత్వాలకు ఇప్పుడు చూస్తే నక్కకు నాగ లోకానికి వున్న తేడా ఉందన్న ఆయన.. రూ.150 కోట్ల తో హార్బర్ ఆధునీకరణ గొప్ప నిర్ణయంగా పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న జట్టీలు నిర్మాణం గతంలో ఎప్పుడు జరగలేదన్న ఆయన.. ఫిషింగ్ జట్టీల ఏర్పాటుతో ఆర్థిక ప్రగతి వుంటుందన్నారు. ఈ రోజు ఇచ్చిన పరిహారం అంచనాలకు తగ్గట్టు అధికారులు ఇచ్చారని.. ఈ పరిహారం వృథా చేయకుండా లాంగ్ లైనర్ బోట్ల ను కొనుగోలు చేయాలని సూచించారు. బోట్ల కొనుగోలుకు బ్యాంకులు సహకరించేలా ప్రభుత్వం చొరవ చూపిస్తుంది.. రాజకీయ పబ్బం గడుపుకునే నాయకులు వస్తారు.. నమ్మకండి అని హితవుపలికారు ఎంపీ మోపిదేవి వెంకటరమణ.