Leading News Portal in Telugu

తెలంగాణ ఎన్నికలు.. బీఆర్ఎస్ ను మించి వైసీపీకే ఎక్కువ టెన్షన్?! | ycp tenssion telangana elections| result| brs| more| effect| ap| jagan| defeat


posted on Nov 23, 2023 2:19PM

తెలుగు రాష్ట్రాల రాజకీయాలలో చిత్ర విచిత్ర రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  ఆంధ్రప్రదేశ్, తెలంగాణగా విడిపోయిన ఈ తొమ్మిదేళ్లలో ఎన్నడూలేని పరిస్థితులు ఇప్పుడు కనిపిస్తున్నాయి. రాజకీయంగా ఒక రాష్ట్రంతో మరొక రాష్ట్రానికి ఎలాంటి అనుబంధం లేకపోగా.. రాజకీయ పార్టీలకు కూడా ఎలాంటి సంబంధం లేదు. తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీలు ఏపీలో  కనీసం పోటీ ఇచ్చే పరిస్థితిలో కూడా లేవు. ఏపీలో వీటి ఉనికి నామమాత్రం కంటే కూడా తక్కువ అనే చెప్పాలి.  అలాగే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ఎప్పుడో తెలంగాణలో తన జెండా పీకేసింది.  ఇక ఏపీలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో పోటీలోనే లేదు. కానీ ఆ తెలుగుదేశం పార్టీయే ఇప్పుడు  తెలంగాణలో గెలుపు ఓటములను శాశించే పరిస్థితిలో ఉంది. అలాగే ఏపీలో తెలుగుదేశం వైసీపీకి అధికార పీఠాన్ని దూరం చేసే స్థితికి చేరింది.  దీంతో రెండు రాష్ట్రాలలో ఉన్న అధికార పార్టీలూ తెలుగుదేశం పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతున్న పరిస్థితిలో ఉన్నాయి.  ఆంధ్రా రాజకీయాల ప్రభావం తెలంగాణపై ఎలా ఉండబోతోందా అన్నది టీఆర్ఎస్ టెన్షన్ పడుతోంది.  అయితే అంతకు మించి తెలంగాణలో ఫలితాలు ఎలా ఉంటాయా అని ఏపీలో అధికారంలో ఉన్న జగన్ పార్టీ వర్రీ చెందుతోంది.  

  దీనికి కారణం ఈసారి తెలంగాణ ఫలితాలు  ఏపీపై తీవ్ర ప్రభావం చూపుతాయనడంలో సందేహం లేదు. తెలంగాణలో బీఆర్ఎస్ మరోసారి అధికారం దక్కించుకుంటే ఏపీ రాజకీయాలు ఒకలా ఉండనున్నాయి.. అదే కాంగ్రెస్ అక్కడ అధికారం దక్కించుకుంటే ఇక్కడ రాజకీయాలు మరోలా ఉంటాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికలలో కూడా తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఏపీ మీద  ప్రభావం  చూపాయి. తెలంగాణలో గత ఎన్నికలలో ఏపీలో  అప్పట్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లగా ఓటమి ఎదురైంది. దీంతో ఆ ప్రభావం ఏపీ ఎన్నికలలో  తెలుగుదేశంపై పడింది. అప్పటి టీఆర్ఎస్ కూడా ఏపీలో  అప్పటికి విపక్షంగా ఉన్న వైసీపీకి మద్దతుగా పని చేసింది.  అయితే ఈసారి తెలంగాణలో  తెలుగుదేశం పోటీకి దూరంగా ఉంది. దీంతో ఆ రాష్ట్రంలో తెలుగుదేశం శ్రేణులు పరోక్షంగా కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నాయి. పవన్ కళ్యాణ్ జనసేన కూడా తెలంగాణ బీజేపీతో కలిసి పోటీ చేస్తున్నది. అయితే ఇక్కడ బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్యనే ప్రధాన పోటీ కనిపిస్తున్నదన్నది పరిశీలకుల విశ్లేషణ.

ఇంకా చెప్పాలంటే ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ అధికారం దక్కించుకునే అవకాశం ఉందని పలు సర్వేలు చెబుతున్నాయి.ఒకవేళ ఆ సర్వేలే నిజమైతే ఏపీలో అధికార  వైసీపీకి చిక్కులు తప్పవనే అభిప్రాయం బలంగా వ్యక్తం అవుతోంది. తెలంగాణ ఫలితాలతో ఏపీ కాంగ్రెస్  ఓకింత పుంజుకునే అవకాశం ఉంది.  అలాగే ఏపీ సీఎం సోదరి, వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల తెలంగాణలో  ఎన్నికల బరి నుంచి తప్పుకుని కాంగ్రెస్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. దీంతో  తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే షర్మిల తన రాజకీయ కార్యక్షేత్రాన్ని ఏపీకి మార్చు అవకాశం ఉంది. రాజకీయ వర్గాలలో జరుగుతున్న చర్చ మేరకు షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అదే జరిగితే  ఏపీలో అధికార పార్టీకి తేరుకోలేని నష్టం జరుగుతుందన్నది పరిశీలకుల విశ్లేషణ.  అదే సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారం దక్కించుకుంటే ఏపీ ఎన్నికలలో  తెలుగుదేశం పార్టీకి బలం చేకూరనుంది.  తెలంగాణలో  తెలగుదేశం శ్రేణులు కాంగ్రెస్ కు మద్దతిచ్చినందుకు బదులుగా  ఏపీ ఎన్నికల సమయంలో  ఆ పార్టీ  తెలుగుదేశం పార్టీకి సహకరించడం గ్యారంటీ. అలాగే కేసీఆర్ ఓటమి అంటే దాని ప్రభావం మిత్రుడైన జగన్ మీద కూడా  పడుతుంది. ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. తెలంగాణను కూడా హస్తం చేజిక్కించుకుంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ విజయానికి మార్గం సుగమమౌతుంది. ఇప్పటికే ఇండియా కూటమి జాతీయ స్థాయిలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదిగిందన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కాంగ్రెస్ విజయం ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి ఎవరన్న ప్రశ్నకు సమాధానంగా నిలుస్తుంది. అదే జరిగితే ఏపీలో జగన్ సర్కార్ కు, పార్టీకీ కూడా పూడ్చుకోలేని నష్టం జరుగుతుందని పరిశీలకులు అంటున్నారు. 

ఇవి కాకుండా పాలనా తీరును బట్టి చూసినా  తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి ఏపీలో వైసీపీకి  శరాఘాతమే అవుతుంది. రైతు బంధు, రైతులకు ఉచిత విద్యుత్, ఐకెపీ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, మిషన్ భగీరథ, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులతో ఒకవైపు సంక్షేమం, మరోవైపు పెట్టుబడుల ఆకర్షణ, పరిశ్రమల స్థాపనతో తెలంగాణలో బీఆర్ఎస్ సర్కార్ ఏదో మేరకు పురోగతి సాధించింది.  అందుకు భిన్నంగా ఏపీలో  జగన్ సర్కార్ అరకొర సంక్షేమం పథకాలను గొప్పగా ప్రచారం చేసుకుంటూ, అభివృద్ధిని గాలికి వదిలేసింది. దీంతో ఏపీలో  వైసీపీపై ప్రజా వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని ఆ పార్టీ కార్యక్రమాలకు వస్తున్న స్పందనే నిదర్శనంగా నిలుస్తున్నది.   అదే అక్కడ బీఆర్ఎస్ గెలిస్తే అసంతృప్తి ఉన్నా అది ఓటమి స్థాయిలో లేదన్న లెక్కలో వైసీపీకి ఏదో మేరకు ఊరట లభించే అవకాశం ఉంది.  అదే అక్కడ బీఆర్ఎస్ పరాజయం  అయితే ఎంతో కొంత అభివృద్ధి చేసిన, సంక్షేమం అందించిన బీఆర్ఎస్ పైనే అంత అసంతృప్తి ఉంటే.. ఏపీ చేయని జగన్ సర్కార్ పై  ప్రజాగ్రహం ఏ స్థాయిలో ఉంటుందన్నది ఇట్లు అర్ధమైపోతుంది. ఈ కారణంతోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయన్న విషయంపై  ఏపీలో అధికారంలో ఉన్న జగన్ పార్టీ తీవ్ర టెన్షన్ పడుతోంది. ఒక విధంగా చెప్పాలంటే తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కంటే ఆ రాష్ట్ర ఎన్నికల ఫలితాలపై వైసీపీకే ఎక్కువ టెన్షన్ పడుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.