Leading News Portal in Telugu

జగన్ కు సుప్రీం షాక్.. బెయిల్ రద్దుపై నోటీసులు జారీ | supreme shock to jagan| bail| cancil| petition| rrr


posted on Nov 24, 2023 11:09AM

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు   పిటిషన్‌పై సుప్రీం కోర్టు జగన్‌, సీబీఐ సహా ప్రతివాదులందరికీ  నోటీసులు జారీ చేసింది. ఇప్పుడే బెయిల్ రద్దు చేయాలా? అని ధర్మాసనం ప్రశ్నించింది. నోటీసులు ఇచ్చి తదుపరి ప్రక్రియ చేపట్టాలని రఘురామ న్యాయవాది కోర్టును కోరారు. ఇప్పటికే విచారణను హైదరాబాద్‌ నుంచి దిల్లీకి మార్చాలని రఘురామ పిటిషన్‌ వేసిన సంగతి తెలిసిందే. బెయిల్ రద్దు  పిటిషన్ తో మపాటు  జగన్ అక్రమాస్తుల కేసు వేరే రాష్ట్రానికి   బదిలీ చేయాలన్న పిటిషన్ ను కూడా జత చేయాల్సిందిగా సుప్రీం ఆదేశించింది. అనంతరం విచారణకు జనవరి మొదటి వారానికి వాయిదా వేసింది. ఈ పిటిషన్ ను జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారించింది. 

జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ పిటిషన్ ను గత ఏడాది అక్టోబరు 28న  తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన సంగతి విదితమే. దీంతో రఘురామకృష్ణం రాజు సుప్రీంను ఆశ్రయించారు.  అక్రమాస్తుల కేసులో జగన్ గత పదేళ్లుగా బెయిల్ పై ఉన్న సంగతి విదితమే. జగన్ బెయిలు రద్దు చేయాలంటూ తెలంగాణ హైకోర్టులో రఘురామ పిటిషన్ వేశారు. ఆ తరువాత రఘురామకృష్ణం రాజుపై సీఐడీ కస్టోడియల్ టార్చర్ కు పాల్పడింది.  కాగా రఘురామకృష్ణం రాజు పిటిషన్ పై అప్పట్లో సీబీఐ స్పందన సరిగా లేదు. దీంతో  తెలంగాణ హైకోర్టు రఘురామకృష్ణం రాజు పిటిషన్ ను తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలోనే  తెలంగాణ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రఘురామకృష్ణం రాజు సుప్రీంను ఆశ్రయించారు.   

ఇలా ఉండగా జగన్ సర్కార్ ఆర్థిక అవకతవకలపై రఘురామకృష్ణం రాజు ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై అక్కడి కోర్టు జగన్ సహా మొత్తం 41 మందికి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.  ఒక ప్రభుత్వం ఆర్ధిక అవకతవకలకు పాల్పడుతుందన్న అభియోగంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం నుండి నోటీసులు అందుకున్న తొలి సీఎంగా నిలవడమే ఆ రికార్డు సృష్టించారు. కాగా ఈ కేసు విచారణ నెల 24కు వాయిదా పడింది. ఏపీ సీఎం వరుసగా ఇలా హైకోర్టు, సుప్రీం కోర్టుల నుంచి నోటీసులు అందుకోవడం సంచలనం సృష్టిస్తోంది. మొత్తం మీద రఘురామకృష్ణం రాజు పిటిషన్లతో జగన్ చిక్కుల్లో పడ్డారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.