Leading News Portal in Telugu

Suryakumar Yadav: ఇది బిగ్ మూమెంట్.. చాలా సంతోషంగా ఉంది: సూర్యకుమార్



Suryakumar Yadav Interview

Suryakumar Yadav React on India Captaincy: భారత జట్టుకు కెప్టెన్సీ చేసే అవకాశం దక్కడం తనకు బిగ్ మూమెంట్ అని టీమిండియా తాత్కలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. దేశానికి ప్రాతినిథ్యం వహించడం తనకు చాలా సంతోషంగా ఉందన్నాడు. రింకూ సింగ్ అసాధారణ ఫినిషింగ్‌తోనే తాము విజయం సాధించామని సూర్య తెలిపాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా వైజాగ్ వేదికగా గురువారం జరిగిన తొలి టీ20లో భారత్ 2 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో రింకూ అద్భుత బ్యాటింగ్‌తో భారత్ విజయం సాదించింది.

మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ… ‘కుర్రాళ్లంతా అద్భుత ప్రదర్శన కనబర్చడం చాలా సంతోషంగా ఉంది. వారి ఎనర్జీ సూపర్బ్. ఓ దశలో మేము ఒత్తిడికి గురయ్యాము. కానీ ప్రతి ఒక్కరూ ఆడిన విధానం అద్భుతం. ఇది నాకు గర్వించదగిన క్షణం. దేశానికి ప్రాతినిథ్యం వహించడం గొప్ప విషయం. అయితే కెప్టెన్సీ చేసే అవకాశం దక్కడం నాకు బిగ్ మూమెంట్. మంచు వస్తుందని భావించాం కానీ రాలేదు. ఇది చిన్న మైదానం కావడంతో బ్యాటింగ్ చేయడం చాలా సులువని నాకు తెలుసు. ఆస్ట్రేలియా ఆడిన తీరు చూస్తే 230-235 పరుగులు చేస్తారని భావించాను. కానీ మా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి కట్టడి చేశారు’ అని అన్నాడు.

Also Read: Suresh Raina: సురేశ్‌ రైనా మెరుపులు.. హైదరాబాద్‌ విజయం!

‘ఫ్రాంచైజీ క్రికెట్‌లో మేము చాలాసార్లు అలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాము. నీ ఆటను ఆస్వాదిస్తూ సత్తా చూపించమని ఇషాన్ కిషన్‌కు చెప్పా. డ్రెస్సింగ్ రూమ్‌లోనే నా కెప్టెన్సీని వదిలేసి బ్యాటింగ్‌ను ఆస్వాదించే ప్రయత్నం చేశా. ఇక్కడి వాతావరణం బాగుంది. ముఖ్యంగా ప్రేక్షకులు అండగా నిలిచారు. రింకూ సింగ్ ఆడిన తీరు పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. తీవ్ర ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉన్నాడు. చివరి ఓవర్లలో ఆస్ట్రేలియాను తక్కువ స్కోర్‌కే పరిమితం చేయడంలో మా బౌలర్లు విజయం సాధించారు’ అని సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు.