Leading News Portal in Telugu

బీఎస్పీ పోటీ బీఆర్ఎస్ కోసమేనా? | bsp contest for brs| telangana| elections| rspraveenkumar| government| oppose| votes


posted on Nov 24, 2023 11:51AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఎస్పీ పాత్ర అనుమానాస్పదంగా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క స్థానం గెలుచుకునే పాటి బలం లేకపోయినా అన్ని స్థానాలలోనూ చెప్పుకోదగ్గ ఓటు బ్యాంకు ఉన్న పార్టీగా బీఎస్పీకి గుర్తింపు ఉంది. మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ ఉత్తర ప్రదేశ్ లో గతంలో అధికారంలో కూడా ఉన్న సంగతి తెలిసిందే.  తెలంగాణలో బహుజనుల సంఖ్య అధికం కావడంతో ఇక్కడ బహుజనుల పార్టీగా బీఎస్పీ ఎదుగుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు. ఆ విశ్వాసంతోనే రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలలోనూ పార్టీ అభ్యర్థులను నిలబెట్టినట్లు చెబుతున్నారు. పార్టీ అధినేత్రి మాయావతి కూడా తెలంగాణ వచ్చి పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం కూడా చేశారు. అయితే గత ఎన్నికలలో కనీసం ఖాతా కూడా తెరవని పార్టీ.. ఈ సారి ఏకంగా 119 అసెంబ్లీ స్థానాలలోనూ అభ్యర్థులను నిలబెట్టడమే ఆ పార్టీ ఎవరికోసం పని చేస్తోందన్న అనుమానాలు వ్యక్తం అయ్యేలా చేసింది. పరిశీలకులు అయితే బీఎస్ఎస్పీ పోటీలో ఉన్నది ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకేనని విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగా బీఎస్పీ, వైఎస్సార్టీపీలకు తెలంగాణలో ఏదో మేరకు మైలేజ్ వచ్చేలా చేశారనీ, అసలా రెండు పార్టీలో రాష్ట్రంలో  హల్ చల్ చేసే స్థాయికి ఎదగడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కారణమని కూడా అంటున్నారు. వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల, మాజీ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ల రజకీయ ప్రవేశానికి ప్రోత్సాహం అంతా కేసీఆరేననీ, గత రెండున్నరేళ్లుగా ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటులో చీలిక తెచ్చేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతూనే ఉన్నారనీ అప్పటి నుంచే పొలిటికల్ సర్కిల్స్ లో ఓ చర్చ అయితే నడుస్తూ వస్తోంది. సరే షర్మిల కేసీఆర్ వ్యూహాలను దాటుకుని సొంత బాట నిర్మించుకున్నారు. అదే వేరే సంగతి. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రం బీఆర్ఎస్ కు గెలుపు బాట వేసేందుకు బహుజన సమాజ్ పార్టీకి బడుగులలో ఉన్న గుర్తింపులు పూర్తిగా వినియోగించేయడానికి కంకణం కట్టుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందులో భాగంగానే సొంతబలం కొంతైనా లేని బీఆర్ఎస్ తరఫున రాష్ట్రంలోని  119 నియోజకవర్గాలలోనూ అభ్యర్థులను నిలబెట్డం ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలికకు మార్గం సుగమం చేశారని అంటున్నారు. 

  ప్రభుత్వ సర్వీసు వదులుకుని స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకుని మరీ బీఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్  బడుగు బలహీనవర్గాలు, బహుజనులకు రాజ్యాధికారం కావాలన్న నినాదంతో  ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అటు కాంగ్రెస్ కు, ఇటు బీఆర్ఎస్ కు సమదూరం పేరుతో లోపాయికారీగా కాంగ్రెస్ ఓట్లలో చీలిక వచ్చేలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యవహరిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   బీఎస్పీకి సంప్రదాయికంగా ఉండే దళిత, బహుజన ఓటు బ్యాంకు కారణంగా కాంగ్రెస్‌ కు నష్టం వాటిల్లే అవకాశాలు కొట్టిపారేయలేమని అంటున్నారు.  

గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 106 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టిన బీఎస్పీ  102 చోట్ల డిపాజిట్ కోల్పోయింది. ఒక్కటంటే ఒక్క స్థానంలో కూడా విజయం సాధించలేదు. అటువంటి పార్టీ ఈ సారి మొత్తం 119 నియోజకవర్గాల్లో  అభ్యర్థులను నిలబెట్టింది.  ఈ సారి కూడా గెలుపు ఆశలు లేవు. కానీ కాంగ్రెస్ ఓట్లు చీల్చడం ద్వారా బీఆర్ఎస్ కు మేలు చేయాలన్న వ్యూహం ప్రస్ఫుటంటా కనిపిస్తోందని పరిశీలకులు అంటున్నారు.