
Israel-Hamas war: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గత రెండు నెలలుగా బందీలుగా ఉన్నవారిలో 25 మందిని హమాస్ ఉగ్రవాదులు విడుదల చేశారు. విడుదలైన వారిలో 12 మంది థాయ్‌లాండ్ దేశస్తులు ఉన్నట్లు ఆ దేశ ప్రధాని స్ట్రెట్టా థావిసిస్ పేర్కొన్నారు. నాలుగు రోజలు కాల్పుల విరమణలో భాగంగా హమాస్, ఇజ్రాయిల్ సంధి ఒప్పందానికి వచ్చాయి. మరోవైపు జైళ్లలో ఉన్న 39 మంది పాలస్తీనియన్ ఖైదీలను ఇజ్రాయిల్ విడుదల చేయనుంది.
Read Also: Revanth Reddy: మూరెడు లేడు కానీ.. మూసిని మింగిండు…
ఖైదీలను విడుదల చేసిన కొన్ని నిమిషాల్లోనే 13 మంది ఇజ్రాయిల్, 12 మంది థాయ్ పౌరులను విడుదల చేస్తున్నట్లు హమాస్ ప్రకటించింది. ఇజ్రాయిల్‌కి తిరిగి రావడానికి కొంతమంది ఇజ్రాయిల్ బందీలను అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీకి అప్పగించారు. ఈజిప్ట్ ద్వారా బందీల మార్పిడి జరుగనున్నట్లు తెలిసింది. ఈజిప్ట్-గాజా సరిహద్దు రఫా బార్డర్ వద్ద వీరిని అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
అక్టోబర్ 7న హమాస్ చేసిన దాడిలో 1200 మంది ఇజ్రాయిల్ పౌరులు మరణించారు. ఇంతే కాకుండా 240 మంది పౌరులను బందీలుగా హమాస్ తీవ్రవాదులు అపహరించి గాజాలో దాచారు. అప్పటినుంచి ఇజ్రాయిల్ సైన్యం గాజాపై విరుచుకుపడుతోంది. ఈ దాడుల్లో 13000 మందికి పైగా సాధారణ ప్రజలు మరణించారు. వీరిలో 5000 మంది పిల్లలు ఉండటం ఆందోళన కలిగించింది. దీంతో ప్రపంచ దేశాలు కాల్పుల విరమణ పాటించాలని ఇజ్రాయిల్ కి సూచించాయి. అయితే బందీల విడుదలపై ఖతార్ మధ్యవర్తిత్వంతో ఈ సంధి కుదిరింది.