
GPS Signal: మిడిల్ ఈస్ట్‌పై నుంచి వెళ్తున్న విమానాల్లో GPS సిగ్నల్స్ కోల్పోతున్నాయి. దీనిపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. మధ్యప్రాచ్యంపై నుంచి వెళ్తున్న పౌర విమానాల్లో కొన్ని సార్లు జీపీఎస్ సిగ్నల్స్ అందడం లేదని నివేదికలు వచ్చిన నేపథ్యంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(DGCA) భారత విమానయాన సంస్థలకు కీలక సూచనలను జారీ చేసింది.
మధ్యప్రాచ్యం పైనుంచి విమానాలు వెళ్తున్న సమయంలో నావిగేషన్ సిస్టమ్ స్ఫూపింగ్‌కి గురవుతోందని పలు నివేదికలు వెలువడ్డాయి. ఇది విమానాల భద్రతకు ప్రమాదంగా మారింది. అయితే దీని నుంచి బయటపడేందుకు విమానయాన సంస్థలకు డీజీసీఏ కీలక సలహాలను జారీ చేసింది. GNSS (గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్) జామింగ్ మరియు స్పూఫింగ్ కారణంగా ప్రమాదం నెలకొన్న కారణంగా విమానయాన పరిశ్రమ అనిశ్చితిలో ఉందని సర్క్యూలర్ పేర్కొంది.
నావిగేషన్ జామింగ్, స్ఫూఫింగ్ ఎదుర్కోవడానికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలని పిలుపునిచ్చింది. ముప్పును పర్యవేక్షించడం, అనాలిసిస్ నెట్వర్క్ రూపొందించాలని డీజీసీఏ కోరింది. సెప్టెంబర్ నెలలో నావిగేషన్ సమస్యలతో ఇరాన్ గగనతలంలోని పలు వాణిజ్య విమానాలు గతి తప్పాయి. అనుమతి లేకుండా ఒక విమానం ఇరాన్ గగనతలంలోకి వెళ్లింది. పైలెట్లు, కంట్రోలర్ ఈ సమస్యను లేవనెత్తారు.
స్ఫూఫింగ్ ఎలా పనిచేస్తుంది..?
మధ్యప్రాచ్యంలోని కొన్ని ప్రాంతలపై ప్రయాణించే విమానాలకు ముందుగా తప్పుడు జీపీఎస్ సిగ్నల్స్ అందుతాయి. ఈ సిగ్నల్స్ విమానంలోని ఇన్‌బిల్ట్ సిస్టమ్స్‌ని, తమకు ఉద్దేశించిన మార్గం నుంచి మైళ్ల దూరంలో ఎగురుతున్నామని భ్రమ కల్పించి మోసగిస్తాయి. ఈ సిగ్నల్స్ విమానం వ్యవస్థను కాంప్రమైజ్ చేసేంత బలంగా ఉంటాయి.
దీని తర్వాత కొన్ని నిమిషాల్లోనే ఇంటీరియల్ రిఫరెన్స్ సిస్టమ్(ఐఆర్ఎస్) అస్థిరంగా మారుతుంది. అనేక సందర్భాల్లో విమానాలు నావిగేషన్ సామర్థ్యాన్ని కోల్పోతాయి. ఉత్తర ఇరాక్, అజర్ బైజాన్‌లతో రద్దీగా ఉండే బిజీ ఎయిర్ వే, ఎర్బిట్ సమీపంలో ఇలాంటి ఘటనలు జరిగాయి. సెప్టెంబర్ నాటికి, 12 వేర్వేరు సంఘటనలు నమోదయ్యాయి. నవంబర్ 20న టర్కీలోని అంకారా సమీపంలో మరొక ఘటన నమోదైంది.
దీనికి పాల్పడుతున్న దోషుల్ని ఇప్పటి వరకు గుర్తించనప్పటికీ.. ప్రాంతీయ ఉద్రిక్తత ఉన్న ప్రాంతాల్లో సైనిక ఎలక్ట్రానిక్ వార్ ఫేర్ సిస్టమ్స్ మోహరించడం వల్ల జామింగ్, స్ఫూఫింగ్ జరుగుతుందని భావిస్తున్నారు. తాజా పరిణామాలు, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్(ఐసీఏఓ) మార్గదర్శకాలను పాటించి, ఈ ముప్పు నుంచి బయటపడాలని డీజీసీఏ సర్క్యూలర్‌లో పేర్కొంది. ఇవి ఎయిర్ క్రాఫ్ట్ ఆపరేటర్లు, పైలెట్లకు, ట్రాఫిక్ కంట్రోలర్లకు తగిన కార్యాచరణ ప్రణాళికను అందిస్తుంది.