
Babu Mohan Emotional: కొడుకు పార్టీ మారడంపై బీజేపీ అభ్యర్థి, సినీ నటుడు బాబు మోహన్ కంటతడి పెట్టుకున్నారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ తండ్రికొడుకులను విడదీసిందని ఆరోపించారు. తన పేరును బీఆర్ఎస్ రాజకీయంగా దుర్వినియోగం చేసి.. కుట్రతో గెలవాలని చూస్తోందని ఆయన ధ్వజమెత్తారు. తన కొడుకు పేరు ఉదయ్ భాస్కర్ అయితే.. ఉదయ్ బాబు మోహన్ అని ప్రచారంలో చెబుతున్నారని తెలిపారు. సిద్దిపేటకు పిలిపించుకుని మరి నా కొడుకు మెడలో కండువా కప్పుతావా? హరీష్ అని మండిపడ్డారు.
బాబు మోహన్‌ను రాజకీయంగా ఓడకొట్టేందుకే హరీష్ రావు, కేసీఆర్‌లు కుట్రపన్నారన్నారు. ఇప్పటి నుంచి నా కొడుకు పేరు ఉదయ్ భాస్కర్ .. ఉదయ్ బాబు మోహన్ కాదని స్పష్టం చేశారు. నా పేరును రాజకీయంగా దురుద్దేశంతో వాడుకోవాలని చూస్తే ఖబర్థార్ హరీష్ రావు ఆయన ఆగ్రహం వ్యక్తి చేశారు. తన కొడుకు రాజకీయాలపై అంత ఆసక్తి ఉంటే తానే టికెట్‌ను త్యాగం చేసేవాడినని, నా కొడుకు టికెట్ కావాలని అడిగితే ఇచ్చేవాడినని బాబు మోహన్ పేర్కొన్నారు. కాగా బాబు మోహన్ తనయుడు ఉదయ్ బాబు మోహన్ ఐదు రోజుల క్రితం హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.