సోషల్ మీడియా ద్వారానే వైసీపీ ఎన్నికల ప్రచారం? | ycp election campaign through social media| hundreds| you| tube| chanels| purchase
posted on Nov 25, 2023 9:54AM
ఏపీలో ఎన్నికలు ఇక నాలుగు నెలల వ్యవధిలోకి వచ్చేశాయి. అధికార పార్టీ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. తీవ్రమైన ప్రజా వ్యతిరేకత, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, పార్టీ కార్యక్రమాలకు క్యాడరే ముఖం చాటేస్తున్న తీరు వెరసి.. వైసీపీలో వచ్చే ఎన్నికలకు సమాయత్తం అవ్వడమెలా అన్న భయం పట్టుకుంది. ముఖ్యమంత్రి జగన్ అయితే పరదాలు లేకుండా తాడేపల్లి ప్యాలస్ దాటి అడుగు బయటపెట్టరు. ఇక నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు జనంలోకి వెళ్లినా ఛీత్కారాలు, నిరసనలు ఎదురౌతున్నాయి.
ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారం కోసం జనంలోకి ఎలా వెళ్లడం అని అధికార వైసీపీ మధనపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ చూపు సామాజిక మాధ్యమంపై పడింది. సోషల్ మీడియాలో పేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, వాట్సాప్ గ్రూపులకు తోడు కొన్ని డిజిటల్ మీడియా చానెళ్లు సైతం ఇప్పటికే జై జగన్ అంటూ స్లోగన్లు ప్రజల చెవులలో వినిపిస్తూనే ఉన్నాయి. అయితే గత నాలుగున్నరేళ్లుగా ఇదే పని చేస్తున్న అటువంటి సామాజిక మాధ్యమ అక్కౌంట్లను జనం పట్టించుకోని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సరికొత్తగా డిజిటల్ మీడియాను వాడుకునేందుకు వైసీపీ రెడీ అవుతోంది. అందు కోసం దాదాపుగా మూడు వందలకు పైగా యూట్యూబ్ ఛానెళ్లతో ప్రభుత్వ సంక్షేమం ప్రచారం భారీ సంఖ్యలో ఫాలోవర్లు, సబ్ స్క్రైబర్లు ఉన్న ఇండివిడ్యువల్ చానెళ్లు, వివిధ జిల్లాలలో నడుస్తున్న యూట్యూబ్ ఛానెళ్ల వినియోగించుకునేందుకు రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.
ఇప్పటి వరకు న్యూట్రల్ గా ఉండే వ్యక్తిగత ఛానెళ్లతో గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి మధ్య సంక్షేమంలో వ్యత్యాసాలను వివరించేలా వీడియోలతో ప్రమోట్ చేసేందుకు వారితో సంప్రదింపులు జరిపి ఒప్పందాలు కుదుర్చుకుందనీ, ఇవీ గాక పలు యూట్యూబ్ చానెళ్లను గంపగుత్తగా కోనేసిందని అంటున్నారు.గత కొన్ని రోజులుగా అప్పటి వరకూ న్యూట్రల్ గా ఉన్న పలు యూట్యూబ్ చానెళ్లు ఇప్పుడు అధికార పార్టీకి అనుకూలంగా భజన చేయడమే ఇందుకు నిదర్శనంగా పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఇలా దాదాపు మూడు వందలకు పైగా చానెళ్లు ఇప్పడు వైసీపీకి అనుకూలంగా పని చేయడానికి రంగం సిద్ధమైందని అంటున్నారు.
గత ఎన్నికల హయంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించిన చానెళ్లు, వైసీపీని ప్రమోట్ చేసిన సోషల్ మీడియా అకౌంట్లు ఇప్పుడు అక్కరకు రాకుండా పోయాయి. ఇవన్నీ వైసీపీ సానుభూతిపరులతోనే నిండిపోయాయి. వాటితో సామాన్య ప్రజలకు చేరువ అయ్యే పరిస్థితి లేదన్న నిర్ధారణకు వైసీపీ పెద్దలు వచ్చేశారు. అందుకే కొద్దిరోజులుగా వైసీపీ డిజిటల్ వింగ్ పాత వాటి స్థానంలో కొత్త వాటిని తీసుకొచ్చింది. కానీ అవి సరిపోవన్నట్లు ఇంకా ఇంకా వ్యక్తిగత చానెళ్లు, మీడియా ఛానెళ్లను అరువు తెచ్చుకుంటున్నారు. ఈ ప్రచారం కోసం వైసీపీ కోట్లాది రూపాయలను వెదజల్లుతోందని అంటున్నారు. వచ్చే ఎన్నికలలో జనం వద్దకు నేరుగా వెళ్లే పరిస్థితి కానరాకపోవడంతో వైసీపీ పూర్తిగా సోషల్ మీడియా ప్రచారానికి పరిమితమౌతుందా అన్న అనుమానాలు రాజకీయ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి.