నందమూరి వసుంధర ఆధ్వర్యంలో హిందూపురంలో కార్తీక మహోత్సవం | nandamuri vasundhara kartika deepostavam in hidupuram| november| 27| all| invite| mla
posted on Nov 25, 2023 4:34PM
తెలుగుదేశం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భార్య వసుంధర ఆధ్వర్యంలో హిందూపురం నియోజకవర్గంలో కార్తీక మాస మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నారు. అందులోభాగంగా సోమవారం (నవంబర్ 27)సామూహిక కార్తీక వన భోజనాలు కార్యక్రమం జరగనుంది. దాని కంటే ముందు అంటే అదే రోజు ఉదయం చిలమత్తూరు మండలం దేమకేతుపల్లిలో కొలువు తీరిన కనుమ శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలోని శివాలయంలో అభిషేకం, బిల్వార్చన, తులసీ దామోదర పూజ నిర్వహించనున్నారు.
ఇక సాయంత్రం 5.00 గంటలకు లేపాక్షిలోని లేపాక్షి దేవాలయంలో జరగనున్న కార్తీక దీపోత్సవంలో పాల్గొంటారు. అనంతరం అంటే రాత్రి 7.00 గంటలకు హిందూపురం ముద్దిరెడ్డిపల్లిలోని శివాలయంలో సామూహిక జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. నందమూరి వసుంధర బాలకృష్ణతోపాటు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కార్తీక మహోత్సవ కార్యక్రమంలో మహిళలు, శివ భక్తులు, నియోజకర్గ ప్రజలు పాల్గొని ఆ పరమ శివుని దివ్య ఆశీస్సులు పొందాలని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులేనని ప్రకటించారు.
నందమూరి బాలకృష్ణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు సినీ హీరోగా అభిమానులను అలరిస్తూనే మరోవైపు ఎమ్మెల్యేగా ప్రజా సేవలో తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఆ క్రమంలో నియోజకవర్గంలో అన్న క్యాంటిన్లు ఏర్పాటు చేసి పేదలకు 5 రూపాయిలకే మంచి భోజనం అందిస్తున్నారు. పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించేందుకు ఆరోగ్య సంజీవని పేరిట.. మొబైల్ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఇప్పటికే హిందూపురం నుంచి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన బాలయ్య బాబు.. మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగనున్నారు. అయితే బాలయ్య ను ఓడించేందుకు జగన్ పార్టీ దీపిక అనే మహిళను హిందూపురం నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించింది. మరోవైపు బాలయ్య బాబును ఓడించేందుకు 2014 ఎన్నికల్లో నవీన్ నిశ్చల్‌ను, అలాగే 2019 ఎన్నికల్లో మహ్మద్ ఇక్బాల్‌ను జగన్ పార్టీ బరిలో దింపినా… ఆయన విజయాన్ని అడ్డుకోవడం జగన్ పార్టీ వల్ల కలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో దీపికను బాలయ్య బాబుపై పోటీ చేయించేందుకు జగన్ పార్టీ సన్నాహాలు చేస్తోంది.
అయితే వచ్చే ఎన్నికల్లో హిందూపురం నుంచి బాలకృష్ణ ఎమ్మెల్యేగా గెలుపొంది.. హ్యాట్రిక్ సాధించడం తథ్యమని తెలుగుదేశం శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కార్తీకమాస మహోత్సవాన్ని నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర హిందూపురం నియోజకవర్గంలో నిర్వహించడం, ఈ కార్యక్రమానికి హిందూపురంలోని బాలకృష్ణ కార్యాలయం తరఫున అందరికీ ఆహ్వానం పలకడం ప్రాధాన్యత సంతరించుకుంది.