Leading News Portal in Telugu

TDP-Vellampalli Srinivasa Rao: 3న చర్చకు సిద్ధమంటూ.. వెలంపల్లి సవాలును స్వీకరించిన టీడీపీ!


TDP-Vellampalli Srinivasa Rao: 3న చర్చకు సిద్ధమంటూ.. వెలంపల్లి సవాలును స్వీకరించిన టీడీపీ!

వైసీపీ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు విసిరిన సవాలును టీడీపీ స్వీకరించింది. ఆర్యవైశ్యులకు ఎవరేం చేశారోననే దానిపై వచ్చే నెల 3వ తేదీన చర్చకు రావాలని టీడీపీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడు డూండీ రాకేష్ పేర్కొన్నారు. ఆర్యవైశ్యులకు టీడీపీ ఏం చేసిందో, జగన్ ప్రభుత్వం ఏం చేసిందో వివరించటానికి తాము సిద్దమని, డిసెంబర్ 3న ఉదయం 11.30గంటలకు విజయవాడ వన్ టౌన్ లో కొత్తగుడుల కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో చర్చకు రావాలని సవాల్ స్వీకరించారు.

‘దమ్ముంటే వెలంపల్లి శ్రీనివాసరావు చర్చకు రావాలి. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తోంది. ఆర్యవైశ్యులపై కక్షసాధింపు ధోరణి అవలంబిస్తోంది. వైశ్యుల్లో చీలికలు తెచ్చి.. వైశ్యులకు ఓటు బ్యాంకే లేదనేలా వ్యవహరిస్తోంది. ఆర్యవైశ్యుల్లోని కోమటి, గుప్త, శెట్టిలు ఆర్యవైశ్యులే. వారిని విభజించడం తగదు. 723 కులాల పేర్లల్లో ఆర్యవైశ్య కులం పేరు లేకపోవడం బాధాకరం. వైసీపీలోని ఆర్యవైశ్య నాయకులు ఎందుకు నోరు పెదపడంలేదు?. 14,600 మంది పేద వైశ్యులు సత్యనారాయణ వ్రతం చేసుకునేందుకు అడ్డంకులు సృష్టించడం తగదు’ అని డూండీ రాకేష్ అన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లకు ఎమ్మెల్యే వెలంపల్లి ఛాలెంజ్ విసిరారు. ఆర్యవైశ్యులకు తాను ఏం అన్యాయం చేశానో చర్చకు సిద్ధంగా ఉన్నానని, టీడీపీ ఆపీస్‌కు రమ్మన్నా కూడా తాను సిద్ధమే అంటూ సవాల్ చేశారు. ఆర్యవైశ్య సంఘాల ముసుగులో తనను ఇబ్బందిపెట్టాలని కొన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్యవైశ్య వైభవం కార్యక్రమం జరగకుండా వెల్లంపల్లి అడ్డుకుంటున్నారని టీడీపీ, జనసేన ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఆయన సవాల్ విసిరారు. ఈ సవాల్ టీడీపీ స్వీకరించింది.