Leading News Portal in Telugu

Myanmar: చైనా సరిహద్దుని స్వాధీనం చేసుకున్న సాయుధ మయన్మార్ గ్రూప్..


Myanmar: చైనా సరిహద్దుని స్వాధీనం చేసుకున్న సాయుధ మయన్మార్ గ్రూప్..

Myanmar: భారత సరిహద్దు దేశం మయన్మార్‌లో ప్రజాప్రభుత్వాన్ని కూల్చి సైన్యం అధికారాన్ని చేపట్టింది. అప్పటి నుంచి ఆ దేశంలో హింస చెలరేగింది. జుంటా పాలకకు వ్యతిరేకంగా అక్కడ సాయుధ గ్రూపులు పోరాటాన్ని తీవ్రతరం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా అక్కడి సైనిక పాలకులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నాళ్లు సైనికులు కంట్రోల్‌లో ఉన్న చైనా సరిహద్దు సమీపంలోని ప్రాంతాలను మూడు సాయుధ మైనారిటీ గ్రూపులు స్వాధీనం చేసుకున్నాయి. ఉత్తర షాన్ రాష్ట్రంలోని ఉన్న ఈ చైనా సరిహద్దు చాలా కీలకం. ప్రస్తుతం ఆ రాష్ట్రం అంతటా ఘర్షణలు చెలరేగాయి.

సైన్యంపై తిరుగుబాటు చేస్తున్న సాయుధ గ్రూపులు సైనిక స్థావరాలు, చైనాతో వాణిజ్యానికి ముఖ్యమైన పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నాయి. నగదు కొరత ఉన్న జుంటా ప్రభుత్వానికి చైనా నుంచి సాయం డబ్బు అందకుండా వాణిజ్య మార్గాలను మూసేశాయి. మయన్మార్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఆర్మీ (MNDAA) కైన్ శాన్ క్యావ్ట్ సరిహద్దు గేటును స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక మీడియా చెప్పింది. ఈ గ్రూపుతో అరకాన్ ఆర్మీ (AA) మరియు తాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ (TNLA)తో మిత్రుత్వ ఉంది. సరిహద్దు వద్ద ఎంఎన్డీఏఏ తన జెండాను ఏగరేసింది.

ప్రస్తుతం ఆక్రమించుకున్న సరిహద్దు మయన్మార్-చైనా వాణిజ్యానికి అత్యంత కీలకంగా ఉంది. ఈ వారం ప్రారంభంలో సరిహద్దు క్రాసింగ్ వద్ద ఆపి ఉన్న 120 ట్రక్కుల్లో మంటలు చెలరేగాయి, దీనికి సాయుధ సమూహాలే కారణమని జుంటా ప్రభుత్వ ప్రతినిధి జా మిన్ తున్ ఆరోపించారు. సైన్యం అధికారం చేపట్టినప్పటి నుంచి అక్కడ సాయుధ తిరుగుబాటు ప్రారంభమైంది. ఇది ఆ దేశాన్ని తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేసింది.

ఇదిలా ఉంటే చైనా, మయన్మార్ సైన్యానికి మద్దతు ఇస్తోంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో చైనా-మయన్మార్ సంయుక్తంగా సరిహద్దు వద్ద సైనిక విన్యాసాలు మొదలుపెట్టాయి. యువాన్ ప్రావిన్స్‌లో నవంబర్ 28 వరకు ఈ విన్యాసాలు జరుగుతాయని చైనా ప్రభుత్వం తెలిపింది. మరోవైపు మయన్మార్ అల్లర్ల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. భారత పౌరులు ఆ దేశానికి ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. అక్కడి నివసిస్తున్న వారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపింది. అయితే తిరుగుబాటుని అణిచివేయడానికి మయన్మార్ ఆర్మీ ప్రజల్ని చంపుతోంది. అక్కడి నుంచి మనదేశంలోని మిజోరాం రాష్ట్రానికి ప్రజలు వలస వస్తున్నారు.