Leading News Portal in Telugu

Siddha Ramaiah: బీఆర్ఎస్, బీజేపీ బొమ్మ బొరుసు లాంటివి..


Siddha Ramaiah: బీఆర్ఎస్, బీజేపీ బొమ్మ బొరుసు లాంటివి..

నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా.. అక్కడ నిర్వహించిన రోడ్డు షోలో కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ, బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్, బీజేపీ బొమ్మ బొరుసు లాంటివని విమర్శించారు. బీజేపీ పార్టీ బీఆర్ఎస్ గెలుపు కొరకు పనిచేస్తుందని చెప్పారు. కేసీఆర్ 10 సంవత్సరాల అధికారంలో ఉండి రాష్ట్రాన్ని లూటీ చేశాడని మండిపడ్డారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రతి ఒక్కరి పై 94 వేల రూపాయల అప్పు చేశారని తెలిపారు. అంతేకాకుండా.. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి దేశానికి నాలుగింతలు అప్పు పెరిగిందని ఆరోపించారు.

మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత.. రాష్ట్రంలో చంద్రశేఖర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత.. దేశంలో, రాష్ట్రంలో ధరలు ఆకాశాన్ని అంటాయని సిద్ధరామయ్య తెలిపారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి 1200 రూపాయలు సిలిండర్ ధరలు పెరిగాయని అన్నారు. తెలంగాణలో డీజిల్ ధరలు రూ.87 ఉంటే, కర్ణాటకలో రూ.97 రూపాయలు ఉందని చెప్పారు. మరోవైపు.. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5 గ్యారంటీలను అమలు చేస్తున్నామని తెలిపారు. చంద్రశేఖర రావు ఆయన కుమారుడు కర్ణాటకలోని గ్యారెంటీలను సక్రమంగా జరగడంలేదని.. అమలు పరచడం లేదని అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదు గ్యారెంటీలను అమలుపరుస్తున్నామని సిద్ధరామయ్య తెలిపారు. అన్న భాగ్యం కింద 7 కిలోలు బియ్యం ఇస్తున్నాం.. గృహలక్ష్మి పథకం ఒక కోటి 14 లక్షల స్త్రీలకు అమలు పరుస్తున్నాం.. 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం.. అలాగే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తరవాత ఆరు గ్యారెంటీలు ఇస్తామని సిద్ధరామయ్య చెప్పారు.