
గ్రేటర్ నోయిడాలోని శారదా యూనివర్శిటీలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ‘స్వయం సమృద్ధి భారతదేశం’ అనే కార్యక్రమంలో ప్రసంగిస్తూ ప్రపంచానికి లౌకికవాదాన్ని బోధించాల్సిన అవసరం లేదని అన్నారు. భారతదేశంలో సెక్యులరిజం ఎప్పటి నుంచో ఉంది.. ఈ దేశం చాలా సంపన్నమైనది.. అది ప్రతి ఒక్కరినీ స్వాగతించింది అని ఆయన పేర్కొన్నారు. భారతదేశం ఇప్పుడు స్వావలంబనతో ఉండాల్సిన అవసరం ఉంది.. అభివృద్ధికి తనదైన నమూనాలో పని చేయాలని కూడా ఆయన అన్నారు. మరే ఇతర దేశాన్ని చూసి ఏమీ చేయనవసరం లేదు అంటూ మోహన్ భగవత్ తెలిపారు.
భారత్ కు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మన రాజ్యాంగంలో సెక్యులరిజం ఉంది అని మోహన్ భగవత్ తెలిపారు. మేము ఎల్లప్పుడూ వైవిధ్యాన్ని గౌరవిస్తాము.. భారతదేశం అందరి ఆనందాన్ని కోరుకుంటుందన్నారు. మరే ఇతర దేశ మోడల్‌ను కాపీ కొట్టకుండా.. స్వీయ ఆధారిత శక్తిని ఉపయోగించాలని భగవత్ చెప్పారు. మన బలాన్ని మనం విశ్వసించకపోతే.. మనం ప్రపంచ నాయకులం కాలేము.. మేము 10 వేల సంవత్సరాలు వ్యవసాయం చేశామన్నారు.. మన మతం మన పర్యావరణాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని మోహన్ భగవత్ తెలిపారు.
ఇక, చైనా మనపై దాడి చేసినప్పుడు అమెరికా సాయం కోరామని మోహన్ భగవత్ చెప్పుకొచ్చారు. అప్పుడు చైనా మనల్ని చితక్కొడుతుందని అమెరికన్లు ఎగతాళి చేశారు.. అయితే 2014 తర్వాత పాకిస్థాన్‌లోకి ప్రవేశించి ఉగ్రవాదులను హతమార్చారు.. దీంతో మన శక్తిని వారు చూశారు.. మనం కూడా మన శక్తిని మేల్కొల్పాలని ఆయన అన్నారు. భారతదేశాన్ని ప్రపంచ అగ్రగామిగా మార్చేందుకు ప్రస్తుతం చాలా చేయాల్సి ఉంది.. 1947లో భారతదేశం రాజకీయంగా, ఆర్థికంగా మాత్రమే స్వతంత్రం పొందాము.. సామాజిక స్వేచ్ఛ కోసం ప్రయత్నాలు ఇంకా మిగిలి ఉన్నాయన్నారు. దీని కోసం వివక్ష గోడను బద్దలు కొట్టాలంటూ భగవత్ పేర్కొన్నారు. ఎంతటి ఘోరాలు జరిగినా మీ మతం మార్గాన్ని వదలకండి అని మన మతం బోధిస్తోంది.. ఈ రోజు మనం యోగా, ఆయుర్వేదాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాం.. దీనిని అందరు స్వాగతిస్తున్నారు.. ఇక, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలను ఆపడానికి మనం కూడా ఆధ్యాత్మిక శక్తిని విస్తరించాలి అంటూ మోహన్ భగవత్ వెల్లడించారు.