మంత్రి అంబటి నో టికెట్.. పక్కన పెట్టేసిన వైసీపీ?! | no ticket to minister ambati| ycp| keep| aside| tdp| kanna| jagan| consider
posted on Nov 27, 2023 11:58AM
ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖామంత్రి అంబటి రాంబాబును వైసీపీ పెద్దలు ఇంటికి పంపించేస్తారా? రానున్న ఎన్నికలలో ఆయనకు టికెట్ లేనట్లేనా? మాజీ మంత్రిగానే కాకుండా మాజీ ఎమ్మెల్యేను కూడా చేసేస్తారా? ఈసారి సీటు కేటాయించడం కష్టమేనని వైసీపీ అధిష్టానం అంబటికి తేల్చి చెప్పేసిందా? నెక్స్ట్ అంబటి రాజకీయ ప్రయాణం ఎటు? అసలు మంత్రి కాగలిగిన అంబటి ఈసారి కనీసం సీటు కూడా దక్కించుకోలేనంతగా ఎందుకు దిగజారిపోయారు? ఇదే చర్చ ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాలలో, అలాగే వైసీపీ వర్గాలలో జోరుగా సాగుతోంది. మంత్రి అంబటి గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన పనిలేదు. నిత్యం ప్రతిపక్ష నేతలపై విమర్శలు చేయడమే ఆయన ఉద్యోగం అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. నిజానికి ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేలు తమ బాధ్యతలు, విధులను ఎప్పుడో పక్కన పెట్టేశారు. కేవలం తెలుగుదేశం, జనసేనల మీద విమర్శలు చేడడమే మంత్రులుగా తమ బాధ్యత, విధి, విద్యుక్తధర్మం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే వీరందరిలోనూ అంబటిది ఒక ప్రత్యేక స్టైల్ ప్రతిపక్ష నేతలు ఎవరు ఏం మాట్లాడినా స్పందించడానికి ఆయన ఎవర్ రెడీ బ్యాటరీలా రెఢీ అంటారు. పోలవరం లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఏమైందంటే మాత్రం నీళ్లు నములుతారు.
ప్రజలకు ఏది అవసరం? అసలు ప్రజలు, ఏం కోరుకుంటున్నారు, ఏమనుకుంటున్నారన్నది ఎప్పుడో మర్చిపోయిన అంబటి తనను మంత్రిని చేసిన జగన్ మోహన్ రెడ్డిపై ఈగ వాలకుండా చూసుకోవడమే తన పని అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అందుకే జగన్ ను ఎవరు ఏమన్నా.. వారిపై నోరు పారేసుకుంటూ, మాటల దాడి, విమర్శల యుద్ధం చేయడమే పనిగా పెట్టుకు్నారు. ఈ విమర్శల దాడి కొన్నిసార్లు రాజకీయాలను దాటి వ్యక్తిగతంగా కూడా మారిపోతుంటుంది. అందుకే విపక్షాలు ఆయన అంబటి అని కాకుండా ఆంబోతు అని అంటుంటాయి. అయితే అధినేత మెప్పు కోసం ఇంత చేసిన అంబటికి ఈసారి టికెట్ దక్కడం కూడా కష్టమే అన్నది ఇప్పుడు వైసీపీ వర్గాలలో గట్టిగా వినిపిస్తున్న మాట. సత్తెనపల్లి అంటే ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే అత్యంత కీలకమైన నియోజకవర్గం. ఈ సీటు నుంచి దిగ్గజ నేతలు ఎందరో పోటీ చేసి గెలిచారు. మాజీ స్పీకర్, మాజీ మంత్రి, దివంగత నేత కోడెల శివప్రసాదరావు ఇక్కడ నుంచే ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు మంత్రి అంబటి ఇక్కడ వైసీపీ తరఫున గెలిచారు. అయితే 2024లో కూడా సత్తెనపల్లి సీటు తనకే కేటాయించాలని అంబటి కోరుతున్నా.. అధిష్టానం అందుకు సుముఖంగా లేదని చెప్తున్నారు. అంతేకాదు, ఇక్కడ నుండి అంబటి బదులు మరో అభ్యర్థిని పరిశీలిస్తున్నారట.
నిజానికి అంబటి సత్తెనపల్లికి నాన్ లోకల్. గత ఎన్నికలలో ఇక్కడ కాపు నాయకుడికి కేటాయించాలనే ఏకైక కారణంతో అంబటి ఈ సీటు దక్కించుకోగలిగారు. అయితే, ఎమ్మెల్యేగా, మంత్రిగా అంబటిపై తీవ్ర ప్రజావ్యతిరేకత మూటగట్టుకున్నారు. ముఖ్యంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో అయితే అంబటిపై వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉంది. ఆయన సొంత సామాజికవర్గంలో కూడా అంబటికి ఏమాత్రం సానుకూలత లేదని వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. జగన్ కు అందిన నివేదికలు కూడా అదే తేల్చేశాయి. సత్తెనపల్లి తెలుగుదేశంఇన్ చార్జిగా మాజీ మంత్రి కన్నా లక్షీనారాయణ ఉన్నారు. ఆయనే వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి తెలుగుదేశం అభ్యర్ధిగా రంగంలో ఉంటారన్నది కూడా దాదాపు ఖరారైపోయింది. అసలే అంబటిపై ఉన్న వ్యతిరేకతకు తోడు ప్రతిపక్షాలకు కలిసి వచ్చే అంశాలు ఉన్న నేపథ్యంలో వైసీపీ రిస్క్ చేసేందుకు ఇష్టపడడం లేదని ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. అందుకే వైసీపీ అధినేత ఈ సారి టికెట్లు నిరాకరించేవారి జాబితాలో అంబటి ఫేరే ఫస్ట్ న ఉందని పార్టీ వర్గాలే బాహాటంగా ఇసుమంతైనా సంకోచం లేకుండా చెబుతున్నాయి.
సత్తెనపల్లి నుండి అంబటిని పక్కన పెట్టి, మాజీ ఎమ్మెల్యే ఎర్రం వెంకటేశ్వరరెడ్డిని వైసీపీ అగ్రనాయకత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. 2004, 2009లలో రెండు సార్లు కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎర్రం.. రాష్ట్ర విభజన అనంతరం రాజకీయంగా వెనకబడిపోయారు. 2019లో జనసేన తరఫున పోటీ చేసిన ఎర్రంకు కేవలం పది వేల ఓట్లే వచ్చాయి. వ్యక్తిత్వంగా మృదు స్వభావి అనే పేరున్న ఎర్రంను ఇప్పుడు వైసీపీ రంగంలోకి దించాలని భావిస్తున్నదని చెబుతున్నారు. ఇక్కడ టీడీపీ నుండి కన్నా పోటీ చేయనుండగా కాపు సామాజికవర్గం ఆయనను సాలిడ్ గా బలపరిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కనుక మిగతా సామాజికవర్గాలపై ఫోకస్ పెట్టేందుకు ఎర్రం అయితేనే బెటరని వైసీపీ పెద్దలు భావిస్తున్నారు. అదే జరిగితే ఇక అంబటి మాజీ మంత్రేకాదు మాజీ ఎమ్మెల్యే అవడం కూడా గ్యారంటీ అంటున్నారు పరిశీలకులు.