Leading News Portal in Telugu

ముసుగు తీసేసిన బీజేపీ! | bjp and brs working together aiming congress| mask| remove| it| ed| attacks| arvind


posted on Nov 27, 2023 12:55PM

సిద్ధాంతాలకు బద్ధమైన పార్టీ అని చెప్పుకునే బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో మాత్రం ఆ సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చేసి అధికారపార్టీని అనుకూలంగా వ్యవహరిస్తున్నది. ఈ క్రమంలో రాష్ట్రంలో పార్టీ ప్రతిష్ట మంటగలిసిపోతున్నా పట్టించుకోవడం లేదు. నిన్న మొన్నటి వరకూ రెచ్చిపోయి మరీ అధికార పార్టీ కుటుంబపాలన, అవినీతిపై విమర్శలు గుప్పించిన బీజేపీ ఇప్పుడు ఎలాంటి బేషజాలూ లేకుండా పొగడ్తలు గుప్పిస్తోంది. తానెటూ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు.. కనీసం జాతీయ స్థాయిలో తనతో పోటీ పడే కాంగ్రెస్ ను రాష్ట్రంలో అధికారానికి దూరంగా ఉంచితే చాలన్న చందంగా వ్యవహరిస్తున్నది. కాంగ్రెస్ ముక్త భారత్   అన్న బీజేపీ నినాదం జాతీయ స్థాయిలో నీరుగారిపోవడాన్ని గమనిస్తున్న ఆ పార్టీ.. రాష్ట్రాలలో అధికారం కోల్పోయినా ఫరవాలేదు.. కాంగ్రెస్ ను అధికారానికి దూరంగా ఉంచితే చాలన్న వ్యూహాన్ని అముల చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది. 

తెలంగాణలో మొదటి నుంచీ బీఆర్ఎస్, బీజేపీలు పరస్పర ప్రయోజనాల పరిరక్షణ కోసమే పని చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. బీఆర్ఎస్ ను బీజేపీ బీ టీమ్ గా ప్రతిపక్ష పార్టీలే కాదు, పరిశీలకులు సైతం అభివర్ణించారు.  వాటన్నిటినీ ఖండిస్తూ వచ్చిన బీజేపీ ఇప్పుడు తన తీరుతో ఆ ఆరోపణలు, విమర్శలూ అన్నీ వాస్తవమేనని తేల్చేస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   తెలంగాణలో బీజేపీ-బీఆర్‌ఎస్ ఒకటేనన్న ప్రచారం క్షేత్రస్థాయిలో  ఉంది. అందుకు బలం చేకూర్చే విధంగా బీజేపీ తీరు ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ తీరు ఒక్క బీజేపీనే కాదు.. అధికార బీఆర్ఎస్ ను కూడా  డ్యామేజి చేస్తోందని అంటున్నారు. వీటన్నిటికీ పరాకాష్ట అన్నట్లుగా ఇంత కాలం బీజేపీలో ఉండి ఇటీవలే కాంగ్రెస్ గూటికి చేరిన  దళిత నేత జి.వివేక్, ఆయన సోదరుడు వినోద్, ఖమ్మం నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇళ్లపై జరిగిన ఐటీ, ఈడీ దాడులను పరిశీలకులు చూపుతున్నారు.

ఈ దాడులు  బీజేపీ, బీఆర్‌ఎస్ బంధాన్ని మరింత బలపరిచేలా ఉన్నాయంటున్నారు. నిన్నటి వరకూ ఉన్న ముసుగును బీజేపీ, బీఆర్ఎస్ లు తొలగించేశాయనీ, కాంగ్రెస్ కు అధికారం నుంచి దూరం చేయడానికే ఇంత కాలం ప్రత్యర్థులుగా రాజకీయం చేశామనీ చెప్పకనే చెప్పినట్లైందని అంటున్నారు. కాంగ్రెస్ లో అభ్యర్థులు లక్ష్యంగా  జరుగుతున్న దాడులు బీజేపీ, బీఆర్ఎస్ రహస్యమైత్రిని బట్టబయలు చేస్తున్నాయనీ, అలాగే అర్వింద్ రేవంత్ కంటే కేసీఆర్ బెటర్ అంటూ చేసిన వ్యాఖ్యలు ఆ రెండు పార్టీల మధ్యా ఉన్న సంబంధాలను సందేహాలకు అతీతంగా బయటపెట్టేశాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.