posted on Nov 27, 2023 1:54PM
టిడిపి నేత, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి జ్యుడీషియల్ రిమాండ్ ను కడప మేజిస్ట్రేట్ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. దీంతో ఆయన్ను పోలీసులు కడప జైలుకు తరలించారు. మొదట రవి రిమాండ్ రిపోర్టును న్యాయమూర్తి వెనక్కి పంపించారు. ఇవాళ కడప కోర్టులో ప్రవేశ పెట్టాలని ఆదేశించారు. 10 నెలల క్రితం ఘటన జరిగితే ఇంత వరకు ఏం చేశారని పోలీసులను న్యాయమూర్తి ప్రశ్నించారు. డిసెంబర్ 11 వరకు రిమాండ్ ను న్యాయస్థానం పొడిగించింది. రిమాండ్ ను పొడిగించడంతో పోలీసులు ఆయనను కోర్టు నుంచి జైలుకు తరలించారు. జనవరి 25న కడప విమానాశ్రయం దగ్గర పోలీసులతో జరిగిన వాగ్వాదం నేపథ్యంలో రవిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నెల 14న వల్లూరు పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
అయితే రవిపై కడప విమానాశ్రయం వద్ద ఆందోళన కేసుతోపాటు టికెట్ బెట్టింగ్ కేసు కూడా నమోదు చేశారు. ఈ కేసులో రవికి 41ఏ నోటీసులు ఇచ్చినట్లుగా తెలిపారు. బెట్టింగ్ కేసును ఇప్పటికిప్పుడు నమోదు చేశారని అటు రవి తరపు న్యాయవాదులు వాదించారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి రవికి రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను కడప జైలుకు తరలించారు.
బీటెక్ రవిని నిన్నరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కడప నుంచి పులివెందులకు వస్తుండగా పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు. గన్ మెన్లు, డ్రైవర్ ను వదిలేసి రవిని అదుపులోకి తీసుకొని అల్లూరి పీఎస్ కు తరలించారు. అక్కడి నుంచి నేరుగా కడపకు తీసుకెళ్లారు.
కడప రిమ్స్ ఆస్పత్రితో వైద్య పరీక్షల అనంతరం రవిని మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపర్చారు. గతంలో యువగళం పాదయాత్ర ప్రారంభానికి ముందు టీడీపీ నేత నారా లోకేష్ కడప పర్యటనకు వచ్చారు. లోకేష్ పర్యటనలో కడప విమానాశ్రయం వద్ద రవి ఆందోళన చేశారని, పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని పోలీసులు కేసు నమోదు చేశారు.