ఒకడే ఒక్కడు మొనగాడు అన్నట్లుగా కాంగ్రెస్ లో రేవంత్ వన్ మేన్ షో! | revanth one man show| congress| campaign| media| debates| pressmeets| public
posted on Nov 27, 2023 3:36PM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ మరో మూడు రోజులలో జరగనుంది. ప్రచారానికి మంగళవారం (నవంబర్ 28) చివరి రోజు. ఈ క్రమంలోనే తెలంగాణలో అన్ని పార్టీలుముమ్మర ప్రచారంలో మునిగిపోయాయి. అభ్యర్థులూ క్షణం తీరిక లేకుండా ఓటర్లను ప్రసన్నం చేసుకునే కార్యక్రమంలో బిజీబిజీగా ఉన్నారు. ముఖ్యంగా ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలైతే కాళ్ళకు బలపాలు కట్టుకొని తెగ తిరిగేస్తున్నారు.
అధికార బీఆర్ఎస్ లో సీఎం కేసీఆర్ రోజుకు ఐదారు సభలలో పాల్గొంటుంన్నారు. ఇదే పార్టీలో ఇతర ముఖ్యనేతలు కేటీఆర్, హరీష్ రావులు రోజుకి ఐదు సభలకు తగ్గకుండా పాల్గొని ప్రసంగాలు చేస్తున్నారు. చివరికి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక బీజేపీ అయితే ప్రధాని నరేంద్ర మోడీ సహా జాతీయ స్థాయి నేతల నుండి ఇతర రాష్ట్రాల నేతలు, రాష్ట్రంలో ఉన్న బడా నేతలంతా రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. కానీ కాంగ్రెస్ లో మాత్రం అంతా రేవంత్ రెడ్డే అన్నట్లుగా పరిస్థితి ఉంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాత్రమే అన్ని చోట్లా కనిపిస్తున్నారు. బహిరంగ సభలు, ర్యాలీలు, మీడియా డిబేట్లు ఇలా ఎక్కడ చూసినా రేవంతే కనిపిస్తున్నారు. ఢిల్లీ వెళ్లి జాతీయ మీడియా డిబేట్లలో కూడా రేవంతే పాల్గొంటున్నారు.
తెలంగాణలో సీనియర్ కాంగ్రెస్ నేతలకు కరువు లేదు. జానారెడ్డి, వీహెచ్ నుండి మొదలు పెడితే.. కోమటి రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జగ్గారెడ్డి, బట్టి విక్రమార్క, మధు యష్కీ, షబ్బీర్ అలీ లాంటి యాక్టివ్ లీడర్లుచాలా చాలా మందే ఉన్నారు. కానీ, వీళ్ళెవరూ ఎక్కడా పెద్దగా కనిపించడం లేదు. మహా అయితే వాళ్ళు పోటీ చేసే నియోజకవర్గాలు, సిట్టింగ్ స్థానాలకు మాత్రమే వీరి ప్రచారం పరిమితమైనట్లు కనిపిస్తోంది. కానీ, రేవంత్ మాత్రం స్వయంగా రెండు నియోజకవర్గాలలో పోటీ చేస్తూ కూడా ఒక్కడే రాష్ట్రమంతా తిరిగి ప్రచారం చేస్తున్నారు. పార్టీ ప్రచారాన్ని భుజాలపైకి ఎత్తుకొని ఎక్కడికక్కడ బీఆర్ఎస్ నేతలను ఏకిపారేస్తూ, ప్రచారాన్ని హోరెత్తిస్తూ అలుపెరగకుండా పని చేస్తున్నారు. అధిష్టానం రేవంత్ కోసం ప్రత్యేకంగా ఓ హెలికాఫ్టర్ కూడా కేటాయించగా.. రోజుకి అరడజనుకు తగ్గకుండా సభలు, ర్యాలీలలో పాల్గొంటున్నారు. సాయంత్రమైతే ఏదో ఒక మీడియా ఛానెల్లో డిబేట్ పెడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం కాంగ్రెస్‌లో రేవంత్ వన్‌మెన్ షో నడుస్తోంది.
నిజానికి పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకం దగ్గరి నుంచి తెలంగాణలో పార్టీ రూపురేకలు మారడం మొదలైంది. అలిగిన నేతను బుజ్జగించారు.. ఎదురు తిరిగితే మందలించారు. సొంత పార్టీ నేతలే పరాయి వాడిలా చూసినా సహించారు. ఇంటింటికీ తిరిగి సీనియర్లను బ్రతిమాలి , బామాలి పార్టీలో కలుపుకు వెళ్లారు. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ కు సానుకూల పవనాలు వీస్తున్నాయంటే అందుకు రేవంత్ ముఖ్య కారణమని చెప్పక తప్పని పరిస్థితి తెచ్చారు. ఎన్నికల సమరానికి షెడ్యూల్‌కు ముందే సమాయత్తమైన రేవంత్.. రైతు, మహిళా, బీసీ అజెండాలను పార్టీ అగ్రనేతలతో విడుదల చేయించారు. సోనియాగాంధీని పిలిపించి ఆరు గ్యారంటీ హామీలు ప్రకటింపచేసి బీఆర్‌ఎస్‌కు ఓ సవాల్ విసిరారు. ఇక అభ్యర్థుల విషయంలోనూ ఆచితూచి వ్యవహించారు. కాస్త ఆలస్యమైనా బలమైన అభ్యర్థులనే బరిలో దించారు. చివరికి పొత్తుల సమయంలో కూడా సీనియర్లంతా ఉన్నా కోదండరాం టీజేఎస్, సీపీఐలతో చర్చలు జరిపి ఒప్పించారు. ఇక ఇప్పుడు ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి అనుకూల పరిస్థితిని ఓట్లుగా మార్చేందుకు రేవంత్ ఒక్కడే పార్టీ ప్రచార యుద్ధాన్ని ముందుండి నడిపిస్తున్నారు.
ఆది నుండి ఎలా ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం దక్కించుకుంటుందనే అంచనా ఉంది. కనుక గెలిస్తే తామే సీఎం అంటూ ఇలాంటి సమయంలో సీనియర్లు బయటకి రావడం కాంగ్రెస్ పార్టీలో సంప్రదాయం. వారిలో ఛరిస్మా ఉన్నా లేకపోయినా ఈ నాలుగు రోజులు ప్రచారంలో తెగ తిరిగేసి తాము తెగ కష్టపడ్డామని, తమకే పదవులు కావాలని డిమాండ్ చేసేవాళ్ళ సంఖ్య కాంగ్రెస్ లో ఎక్కువగానే ఉంటుంది. ఇక ఎప్పుడూ అలకపాన్పుపై ఉండే నేతలు, పార్టీకి నేనే సీనియర్, నా వలనే కాంగ్రెస్ ఇంకా బ్రతికి ఉందనే నేతలకు కూడా కొదవ లేదు. కానీ, హైకమాండ్ ఏం చెప్పిందో.. వ్యూహకర్త సునీల్ కనుగోలు ప్రణాళిక ఏంటో.. రేవంత్ ఎలా ఒప్పించారో కానీ.. తెలంగాణ ఎన్నికలలో రేవంత్ వన్ అండ్ ఓన్లీ హీరో అయిపోయారు. ఆర్ధికంగా కూడా పార్టీ కోసం రేవంత్ భారీగానే ఖర్చు పెడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో రేపు ఫలితం ఎలా ఉన్నా అందుకు తొలి క్రెడిట్ అందుకొనే నేతగా రేవంత్ ఎమర్జ్ అయ్యరనడంలో సందేహం లేదని పరిశీలకులు అంటున్నారు.