Leading News Portal in Telugu

Andhra Pradesh: ఎన్నికల విధులకు దూరంగా గ్రామ వాలంటీర్లు.. సుప్రీంకోర్టులో విచారణ


Andhra Pradesh: ఎన్నికల విధులకు దూరంగా గ్రామ వాలంటీర్లు.. సుప్రీంకోర్టులో విచారణ

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బందిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని దాఖలైన పిటిషన్‌పై ఈ రోజు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.. ఎన్నికల విధుల్లో గ్రామ, వార్డు వాలంటీర్లు, సచివాలయ సిబ్బందిని ఉపయోగించవద్దని, వారిని ఎన్నికల విధులకు దూరం పెట్టాలంటూ.. ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ నేతృత్వంలోని సిటిజన్‌ ఫర్‌ డెమొక్రసీ సంస్థ.. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అక్రమాలకు తావిస్తున్న వాలంటీర్‌ వ్యవస్థను రద్దు చేయాలని కూడా సుప్రీంకోర్టులో దాఖలో చేసిన పిల్‌లో పేర్కొంది సిటిజన్‌ ఫర్‌ డెమొక్రసీ సంస్థ. వాలంటీర్ల ద్వారా సేకరించిన డేటాను ఐప్యాక్, రామ్‌ ఇన్ఫో ప్రైవేట్‌ లిమిటెడ్‌ లాంటి సంస్థల ద్వారా ప్రొఫైలింగ్‌ చేయించడంపై పరిశీలన కోసం ప్రత్యేక సాంకేతిక కమిటీని ఏర్పాటు చేయాలని అత్యున్నత న్యాయస్థానాన్నికి విజ్ఞప్తి చేసింది..

ఇక, గ్రామ, వార్డు వాలంటీర్‌ వ్యవస్థను ఎన్నికల సంబంధ విధుల నుంచి పూర్తిగా తప్పించాలని కోరింది సిటిజన్‌ ఫర్‌ డెమొక్రసీ.. ఓటర్ల జాబితా రూపకల్పన, ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్ల సేవలను ఉపయోగించేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని పిల్‌లో కోరింది సిటిజన్‌ ఫర్‌ డెమొక్రసీ.. ఇక, దీనిపై సుప్రీంకోర్టులో ఎలాంటి వాదనలు సాగనున్నాయి.. సుప్రీం తీర్పు ఎవరికి అనుకూలంగా వస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. కాగా, ఏపీలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. గ్రామ సచివాలయ వ్యవస్థ నిర్వహణకు వాలంటీర్లను, సచివాలయ సిబ్బందిని వినియోగిస్తోంది. ఈ వ్యవస్థపై కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి.. ఇప్పుడు సుప్రీంకోర్టు వరకు పంచాయతీ వెళ్లడంతో ఏం జరుగుతుంది? అనేది ఉత్కంఠగా మారింది.