Leading News Portal in Telugu

అంచనాలకు అందనంత భారీగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వ్యయం! | telangana election expenditure to set new| records| constituency| 100crores| munugodu| hujurabad


posted on Nov 28, 2023 9:07AM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను ప్రధాన పార్టీలు మూడూ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ అయితే ఈ ఎన్నికలలో డూ ఆర్ డై అన్నట్లుగా పోరాడుతున్నాయి. ఈ క్రమంలో నే తెలంగాణ  అసెంబ్లీ ఎన్నికలు కొత్త రికార్డు సృష్టించడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే ఈ రికార్డు  ఓటింగ్ శాతంలోనో, మెజారిటీలలోనో, జయాపజయాలలోనో  కాదు..   ఓటరు చైతన్యం విషయంలో  అయితే అసలు కానే కాదు. మరి దేంట్లో అంటే  ఎన్నికల వ్యయంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పాత రికార్డులన్నిటినీ తిరగరాస్తాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ విషయంలో పోటీలో ఉన్న అభ్యర్థులే కాదు, సామాన్య జనం కూడా పరిశీలకుల విశ్లేషణలతో ఏకీభవిస్తున్నారు.  మునుగోడు, హుజూరాబాద్ ఉప ఎన్నికల వ్యయంలోనే రికార్డులు తిరగరాసిన చరిత్ర ఉన్న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పాత రికార్డులన్నిటినీ బద్దలు కొట్టేసి కొత్త రికార్డును సృష్టిస్తాయనీ, ఈ విషయంలో సందేహాలకు, అనుమానాలకూ ఆస్కారమే లేదని అంటున్నారు. గతంలో ఉప ఎన్నికలలోనే ధన ప్రవాహాన్ని చూసి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఉప ఎన్నిక జరిగితే బాగుంటుందన్న అభిప్రాయాన్ని అప్పట్లో జనం వ్యక్తం చేశారు. ఆమేరకు పలు నియోజకవర్గాలలో డిమాండ్లు కూడా వెల్లువెత్తిన సంగతి విదితమే. తమ నియోజకవర్గంలో ఉప ఎన్నిక కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేపై రాజీనామాకు జనం నుంచి ఒత్తిడి పెరిగిన ఉదంతాలు కూడా ఉన్నాయి. 

ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నందున ఎన్నికల వ్యయంలో గత రికార్డులు పదిలంగా ఉండే అవకాశం ఇసుమంతైనా లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  2012 అక్టోబర్ లో హుజూరాబాద్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక అప్పటికి ఒక రికార్డు. ఆ తరువాత గత ఏడాది నవంబర్ లో మునుగోడు నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నిక హుజూరాబాద్ ఉప ఎన్నిక రికార్డును తిరగరాసింది. ఇప్పడు అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి.  ఎన్నికల ఖర్చు విషయంలో  ఈ సారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అన్ని రికార్డులను తిరగరాయడం ఖాయమని అంటున్నారు.   తెలంగాణలో 2021లో జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రజాస్వామ్య వ్యవస్థపై ఎప్పటికీ చెరగని మరకగా మిగిలిపోయిందని అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు. ఆ తరువాత గత ఏడాది నవంబర్ లో జరిగిన మునుగోడు ఉన ఎన్నిక  హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రజాసామ్య వ్యవస్థపై మిగిల్చిన చెరగని మరకను మరిచిపోయేలా అంత కంటే పెద్ద మరకను మిగిల్చింది. 

హుజురాబాద్ ఉప ఎన్నికకు కొన్ని నెలల ముందు నుంచే, ఎన్నికల సందడి మొదలైంది. నియోజక వర్గం ప్రజలు ఇంచు మించుగా నాలుగు నెలల పాటు, నిత్య విందులలో మునిగి తేలారు. అవును, హుజురాబాద్ ఉప ఎన్నిక ఖర్చు అక్షరాలా ఇన్ని కోట్లని ఎవరూ లెక్కకట్టలేదు, కానీ ఒక అంచనా ప్రకారం ఆ ఉప ఎన్నికకు అయిన ఖర్చు వెయ్యి కోట్ల రూపాయల పైమాటేనని అప్పట్లో గట్టిగా వినిపించింది.   ప్రభుత్వమైతే హుజారాబాద్ ఉప ఎన్నిక జరుగుతుందని తెలిసిన క్షణం నుంచీ అంటే మూడు నాలుగు నెలల ముందు నుంచీ  నియోజకవర్గంలో  అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసమంటూ   ఖజానా నుంచి రూ.5 వేల కోట్ల వరకు ఖర్చు చేసిన మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే అధికారిక లెక్కలే ఆ విషయాన్ని చెబుతున్నాయి. అది కాకుండా అధికార పార్టీ హుజూరాబాద్ లో విజయం కోసం చేసిన ఖర్చు అదనం. అలాగే అధికార పార్టీకి దీటుగా బీజేపీ కూడా తమ పార్టీ అభ్యర్థి ఈటల విజయం కోసం వ్యయం చేసింది. ఓటు రేటు రూ.6000 నుంచి రూ.10,000 వేల వరకూ పలికిందన్న ప్రచారం కూడా అప్పట్లో గట్టిగా జరిగింది.  హుజురాబాద్ ఉపఎన్నిక రాష్ట్రంలో కాదు, దేశంలోనే,  అత్యంత ఖరీదైన ఉప ఎన్నికగా అప్పట్లో చరిత్ర  సృష్టించింది. అంతే కాదు, అధికార తెరాస ఇచ్చిన  కానుకల కవర్లు తమ దాకా రాలేదని ఓటర్లు  అప్పట్లో తెరాస నాయకులను బహిరంగంగా నిలదీశారు. ధర్నాలు చేశారు. ఆందోళనలకు దిగారు. అదీ  హుజురాబాద్ ఉప ఎన్నిక అప్పట్లో  సృష్టించిన చరిత్ర. వాస్తవానికి  హుజురాబాద్ ఉప ఎన్నిక తర్వాత  రాజీనామాకు ఎమ్మెల్యేల పై ప్రజల వత్తిడి పెరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా చేసి, ఉప ఎన్నిక వస్తే హుజూరాబాద్ ఓటర్లకు దక్కిన  భోగ భాగ్యాలు తమకు కూడా దక్కుతాయనే ఆశలు అప్పట్లో అందరిలో చిగురించాయి. అందుకే ఎమ్మెల్యేల రాజీనామాకు ప్రజలు డిమాండ్ చేశారు.

 అంతలా రికార్డులు సృష్టించిన ఉప ఎన్నిక తరువాత మునుగోడు నియోజకవర్గానికి గత ఏడాది నవంబర్ లో ఉప ఎన్నిక జరిగింది.  ఆ ఉప ఎన్నిక హుజూరాబాద్ రికార్డులను తిరగరాసింది.  అధికార బీఆర్ఎస్ (అప్పటికి టీఆర్ఎస్), ప్రధాన ప్రతిపక్షాలు కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికల ఖర్చు విషయంలో పోటీలు పడ్డాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక తరువాత ఓటర్ల డిమాండ్ కారణంగా పార్టీలు పోటీలు పడక తప్పని అనివార్య పరిస్థితి తలెత్తింది. ఎందుకంటే మునుగోడు ఉప ఎన్నిక విషయంలో  ఓటర్ల అంచనాలను రీచ్ కావడానికి మూడు ప్రధాన పార్టీలూ వ్యయం విషయంలో ఆకాశాన్నే హద్దుగా పెట్టుకున్నాయి.   మూడు ప్రధాన పార్టీలూ ఒక్కో ఓటుకు ఒక్కో పార్టీ రూ.10 వేల చొప్పున ఇచ్చాయన్న ప్రచారం జరిగింది.  అంటే, మూడు పార్టీల నుంచి కలిపి ఓటుకు రూ.30 వేల వరకూ ఒక్కో ఓటుకు పందేరం చేశాయన్న మాట.  ఈ నేపథ్యంలోనే  అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో ఎన్నికల వ్యయం విషయంలో గత రికార్డులన్నిటినీ తుడిచిపెట్టేయడం ఖాయమన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  మొత్తం మీద తెలంగాణ ఎన్నికలను డబ్బే శాసిస్తోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. 

వాస్తవానికి ఒక్కో అభ్యర్థి ఎన్నికల వ్యయం ఒక్కో అభ్యర్థి ఎన్నికల వ్యయం నిబంధనల ప్రకారం 40లక్షల రూపాయలకు మించకూడదు.  అయితే ఎలా చూసుకున్నా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఒక్కో అభ్యర్థి తక్కువలో తక్కువ  వంద కోట్లకు పైగా వ్యయం చేశారని అంటున్నారు.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచీ కోట్లలో పట్టుబడుతున్న నగదే ఇందుకు నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.