Leading News Portal in Telugu

Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌ను వీడనున్న బుమ్రా.. కారణం అతడేనా?


Jasprit Bumrah: ముంబై ఇండియన్స్‌ను వీడనున్న బుమ్రా.. కారణం అతడేనా?

Will Jasprit Bumrah Join RCB ahead IPL 2024: ఐపీఎల్ 2024 మినీ వేలంకు ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ కెప్టెన్సీ కూడా వదులుకుని ముంబై ఇండియన్స్‌లో చేరాడు. ఇది క్రికెట్‌ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశం అయింది. తాజాగా ముంబై ఇండియన్స్‌ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఆ జట్టును వీడుతున్నాడని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు కారణం హార్దిక్ ముంబైలోకి రావడమే అట. అందులో ఎంత నిజముందో తెలియదు కానీ.. ప్రస్తుతం నెట్టింట బుమ్రా పేరు మాత్రం ట్రెండింగ్ అవుతోంది.

జస్ప్రీత్ బుమ్రా ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ‘నిశ్శబ్దమే కొన్నిసార్లు అత్యుతమ సమాధానం’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. ఈ పోస్ట్ ముంబై ఇండియన్స్‌ను బుమ్రా వీడనున్నాడనే వాదనకు బలం చేకూరుస్తోంది. అంతేకాకుండా ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్ వేదికగా ముంబై ఇండియన్స్ పేజీలను అన్‌ఫాలో చేయడం.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) పేజీని ఫాలో అవుతుండటం కూడా ముంబైకి బుమ్రా గుడ్‌ బై చెపుతున్నాడనడానికి బలం చేకూరుస్తోంది. ట్రేడింగ్ ద్వారా ఆర్‌సీబీలోకి బుమ్రా వెళ్తున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. బుమ్రా కోసమే జోష్ హజెల్‌వుడ్‌ను ఆర్‌సీబీ వదిలేసిందనే వార్తలు వస్తున్నాయి.

రోహిత్ శర్మ తర్వాత ముంబై ఇండియన్స్ భవిష్యత్తు సారథ్యంపై జస్ప్రీత్ బుమ్రా ఆశలు పెట్టుకున్నాడట. ట్రేడింగ్ ద్వారా హార్దిక్ పాండ్యా ముంబైలోకి రావడంతో బుమ్రా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. హార్దిక్ రాకతో కెప్టెన్సీ అవకాశాలు లేవని భావించిన బుమ్రా.. ఆర్‌సీబీలోకి వెళ్లేందుకు సిద్దమయ్యడట. రోహిత్‌ శర్మ టీ20లకు స్వస్తి పలకాలనే యోచనలో ఉన్నాడన్న వార్తల నేపథ్యంలో.. హార్దిక్‌ ముంబై కెప్టెన్సీ చేపట్టడం లాంఛనమే కానుంది. ఇదే బుమ్రా అసహనానికి కారణం అట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే.. డిసెంబర్ 12 (ట్రేడింగ్ విండోకు ఆఖరి గడువు) వరకు ఆగాల్సిందే.