
Elon Musk: టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ హమాస్ దాడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్లో ఎలాన్ మస్క్ భేటీ అయిన సందర్భంలో ఈయన ఉగ్రవాదానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయిల్, గాజాలో కలిపి 16,000 మందికి పైగా మరణాలకు కారణమైన ఇజ్రాయిల్-హమాస్ యుద్ధం పరిణామాలపై ఇరువురు చర్చించారు. ఈ సమావేశంలో హమాస్ ఉగ్రవాదులను హతమార్చడం తప్ప వేరే మార్గం లేదని ఎలాన్ మస్క్ అన్నారు.
కొత్త తరం ప్రజలు ‘‘ హంతకులుగా శిక్షణ పొందకుండా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని, ప్రజలలో శ్రేయస్సును నిర్మించాలి’’ అని పిలుపునిచ్చారు. ‘‘ నేను ప్రధాని బెంజిమిన్ నెతన్యాహూతో ఇప్పుడే మాట్లాడాను. గాజా పరిస్థితిలో మూడు విషయాలు జరగాలి. పౌరులను హత్య చేయాలనే పట్టుబట్టే వారిని చంపడం తప్ప వేరే మార్గం లేదు. వారు తమ మనసును మార్చుకోరు’’ అని మస్క్ ఇజ్రాయిల్ అధ్యక్షుడితో అన్నారు. రెండో విషయం ఏంటంటే.. కొత్త తరం ప్రజలు హంతకులుగా మారకుండా ప్రజల మధ్య శ్రేయస్సును నిర్మించడం ముఖ్యమని ఆయన అన్నారు.
అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు దాడి చేసిన గాజా సరిహద్దుల్లోని ఇజ్రాయిల్ కిబ్బట్జ్ క్ఫర్ అజా పర్యటన గురించి మాట్లాడుతూ.. తమ దగ్గరి, ప్రియమైన వారిని కోల్పోయిన కుటుంబాలకు మానసికంగా కష్టతరమైన రోజు అని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ అధ్యక్షుడితో భేటీ సందర్భంగా హమాస్ చేతిలో ఉన్న బందీల కుటుంబాలతో మస్క్ సమావేశమయ్యారు. బందీల తండ్రి అతనికి సింబాలిక్ డాగ్ ట్యాగ్‌ను బహుమతిగా ఇచ్చారు. దీనిపై ‘ మా హృదయాలు గాజాలో బందీలుగా ఉన్నాయి’ అని ఉంది. గాజాలోని బందీలు విడుదలయ్యే వరకు ఈ ట్యాగ్ ప్రతీ రోజు ధరిస్తానని మస్క్ చెప్పారు.
ఇదిలా ఉంటే నాలుగు రోజుల సంధిలో భాగంగా ఇజ్రాయిల్ 150 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. అందుకు ప్రతిగా హమాస్ 59 మంది బందీలను విడుదల చేసింది. సంధిని మరో రెండు రోజపులు పొడగించుకోవాలని ఇరుపక్షాలు ఖైదీలను, బందీలను మార్చుకోవాలని భావిస్తున్నాయి. సోమవారం ఇజ్రాయిల్, ఎలాన్ మస్క్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇజ్రాయిల్ ఆమోదంతో గాజాలో స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను స్పేస్ ఎక్స్ అందిస్తుంది.