
Uttar Pradesh: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ముజఫర్‌నగర్‌లోని ఓ కాలేజీలో ముస్లిం విద్యార్థినులు తలపెట్టిన ఫ్యాషన్ షో వివాదాస్పదం అవుతోంది. ఈ షోపై జమియత్-ఏ-ఉలేమా అనే ముస్లిం సంస్థ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మంగళవారం దీనిపై బీజేపీ స్పందించింది. ముస్లిం సంస్థ తీరును తప్పుపట్టింది. బీజేపీ ఎమ్మెల్యే సిద్ధార్థ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఫ్యాషన్ షోలో బురఖాలు ధరించిన మహిళలు ర్యాంప్‌పై నడవడం నిషేధమని ఖురాన్ రాసి ఉంటే చూపించాలని జమియల్ ఏ ఉలేమాను కోరారు. దీనిని ఇష్యూ చేయొద్దని ముస్లింసంస్థకు ఆయన సూచించారు.
ఖురాన్ లో రాసి ఉంటే వెళ్లి కాలేజీ అధికారులకు చూపించాలి, లేకపోతే అభ్యంతరం చెప్పకూడదని బీజేపీ ఎమ్మెల్యే అన్నారు. ర్యాంప్ వాక్, ష్యాషన్ షోల ద్వారా సమాజంలో వివిధ రకాల వేషధారణలు ఆదరించబడుతున్నాయని ఆయన అన్నారు. నేటి సమాజంలో ర్యాంప్ వాక్‌కి ఆమోదం ఉందని చెప్పారు. బురఖా ఫ్యాషన్ ప్రదర్శనకు సంబంధించి అంశం కాదని పేర్కొంటూ సోమవారం జమియత్-ఏ-ఉలేమా జిల్లా కన్వీనర్ మౌలానా ముకర్రం ఖాస్మీ దీన్ని వ్యతిరేకించారు. ఇటువంటి చర్య ఒక నిర్ధిష్ట మతాన్ని లక్ష్యంగా చేసుకుంటుందని, ముస్లిం సమాజం మనోభావాలను దెబ్బతీసే అవకాశం ఉందని అన్నారు.