Leading News Portal in Telugu

Telangana Elections 2023: తెలంగాణలో మూగబోయిన మైకులు.. ప్రచారానికి తెర


Telangana Elections 2023: తెలంగాణలో మూగబోయిన మైకులు.. ప్రచారానికి తెర

తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రాష్ట్రంలోని 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. ప్రచారంలో దూసుకెళ్లిన అభ్యర్థుల మైకులు మూగబోయాయి. రాజకీయ నాయకుల మైకులు, ప్రచార వాహనాలు, పార్టీల పాటలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఈసీ నిబంధనల ప్రకారం పోలింగ్ ముగింపు సమయానికి 48 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే 144 సెక్షన్ అమల్లోకి వస్తుంది. ఈ క్రమంలో.. రాష్ట్రంలో వైన్స్ షాపులు కూడా మూతపడనున్నాయి. 48 గంటల పాటు మద్యం దుకాణాలను మూసేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. కాగా.. తమ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అగ్ర నేతలు విసృతంగా ప్రచారంలో పాల్గొన్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్.. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ దాదాపు 100కు పైగా సభల్లో ప్రసంగించారు.

Hai Nanna: ఓడియమ్మ హీట్.. నాని, శృతి రొమాన్స్..

ఇదిలా ఉంటే.. నవంబర్ 30న జరిగే పోలింగ్‌కు ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది. మొత్తం 119నియోజకవర్గాలకు గానూ ఎన్నికల బరిలో 2,290 మంది ఉన్నారు. వారిలో 221మంది మహిళా అభ్యర్థులు పోటీలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా 35,655 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసింది ఎన్నికల సంఘం. పోలింగ్ సందర్బంగా భద్రతా విధుల్లో 45వేల మంది తెలంగాణ పోలీసులు ఉండనున్నారు. పోలింగ్‌కు 48 గంటల ముందే రాష్ట్రమంతటా 144 సెక్షన్‌ అమల్లోకి వస్తుందని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు.. సమావేశాలు, ఇంటింటి ప్రచారం లాంటివి చేయవద్దని ఈసీ సూచించింది. మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి 30వ తేది సాయంత్రం 5 గంటల వరకు సైలెంట్‌ పీరియడ్‌లో టీవీ, సోషల్‌ మీడియాలో ప్రకటనలకు అనుమతి లేదు. పత్రికల్లో వేసే ప్రకటనలకు మోడల్‌ కోడ్‌ మీడియా కమిటీ ముందస్తు అనుమతి ఉండాలి. వేరే నియోజకవర్గం నుంచి ప్రచారానికి వచ్చిన వాళ్లు స్థానికంగా ఉండకూడదని, లాడ్జ్‌లు, గెస్ట్‌ హౌస్‌లు, హోటల్‌లో బస చేస్తున్న ఇతర ప్రాంతాల వారు ఈరోజు సాయంత్రం 5 గంటల లోపు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 29, 30 తేదీల్లో రాజకీయ నాయకులు ఎన్నికలకు సంబంధించిన ఇంటర్వ్యూలు ఇవ్వరాదని, పత్రికా గోష్ఠులు నిర్వహించరాదని, బల్క్ ఎస్‌ఎంఎస్‌లు పంపకూడదని స్పష్టం చేశారు.

South Africa: సౌత్ ఆఫ్రికా గనిలో ప్రమాదం.. ఎలివేటర్ కూలి 11 మంది మృతి

తెలంగాణలో మొత్తం 3కోట్ల 26లక్షల 2799 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషులు 1కోటి 62లక్షల 98వేల 418ఓట్లు.. మహిళలు 1కోటి 63లక్షల 1705 ఓట్లు ఉన్నాయి. అంతేకాకుండా.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2676 ట్రాన్స్ జెండర్ ఓట్లు ఉన్నాయి. కొత్తగా యువ ఓటర్లు (18-19) 9లక్షల 99వేల 667 మంది ఉన్నారు. అందులో అబ్బాయిలు.. 570274, అమ్మాయిలు.. 429273, ట్రాన్స్ జెండర్స్ 120 మంది, సీనియర్ సిటిజన్ ఓటర్లు( 80ఏళ్ల పైబడి) 440371 మంది ఉన్నారు. NRI ఓటర్లు 2933, దివ్యాంగులు 5లక్షల 6వేల 921 మంది ఉన్నారు. కాగా.. రాష్ట్ర వ్యాప్తంగా 12వేల సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు ఈసీ గుర్తించింది. మరోవైపు సమస్యత్మాక పోలింగ్ కేంద్రాలలో మూడంచెల భద్రత, అత్యంత సమస్యత్మాక పోలింగ్ కేంద్రాలలో ఐదెంచల భద్రత ఏర్పాటు చేయనున్నారు. సిర్పూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలం సమస్యాత్మక నియోజకవర్గాల్లో గంట ముందుగానే అంటే.. సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. మిగిలిన 106 నియోజకవర్గాల్లో ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ నెల 30వ తేదీన పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3వ తేదీన ఫలితాలు వెలవడనున్నాయి.