Leading News Portal in Telugu

Rahul Dravid-BCCI: నెహ్రా వద్దన్నాడు.. రాహుల్‌కు బీసీసీఐ మరో ప్రతిపాదన!


Rahul Dravid-BCCI: నెహ్రా వద్దన్నాడు.. రాహుల్‌కు బీసీసీఐ మరో ప్రతిపాదన!

Ashish Nehra rejects India Coaching offer: భారత్ క్రికెట్ జట్టు కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ రెండేళ్ల పదవీకాలం వన్డే ప్రపంచకప్‌2023తో ముగిసింది. టీమిండియా కోచ్‌గా మరో దఫా కొనసాగాలని మెగా టోర్నీకి ముందే బీసీసీఐ ద్రవిడ్‌ను కోరింది. అయితే మిస్టర్ డిపెండబుల్‌ అందుకు సానుకూలంగా లేకపోవడంతో.. బీసీసీఐ మరో సరైన వ్యక్తిని వెతికే పనిలో పడింది. ఈ లోగా స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్‌కు తాత్కాలిక కోచ్‌గా వీవీఎస్‌ లక్ష్మణ్‌కు బాధ్యతలు అప్పజెప్పింది.

టీమిండియా మాజీ పేసర్‌, గుజరాత్‌ టైటాన్స్‌ హెడ్‌ కోచ్‌ ఆశిష్‌ నెహ్రాను బీసీసీఐ పెద్దలు కలిశారు. టీమిండియా కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాలని అడగ్గా.. బీసీసీఐ ప్రతిపాదనను నెహ్రా తిరస్కరించారట. ఐపీఎల్‌ కమిట్‌మెంట్ కారణంగా కోచ్‌గా ఉండలేనని చెప్పినట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌కు తొలిసారే కప్‌ సాధించడంలో నెహ్రా కీలక పాత్ర పోషించాడు. ఆ అనుభవం టీమిండియాకు కలిసొస్తుందని బీసీసీఐ భావించగా.. అది కుదరలేదు. దాంతో మరో ఆఫర్‌తో బీసీసీఐ రాహుల్‌ ద్రవిడ్‌ ముందుకొచ్చింది. రెండేళ్లు కాకపోయినా.. కనీసం వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ వరకైనా కోచ్‌గా బాధ్యతలు చేపట్టాలని కోరింది.

ఒకవేళ రాహుల్ ద్రవిడ్ బీసీసీఐ కొత్త ఆఫర్‌కు అంగీకరిస్తే.. వన్డే ప్రపంచకప్‌ 2023 వరకు ఉన్న సహాయక సిబ్బంది కూడా కొనసాగే అవకాశం ఉంది. బ్యాటింగ్‌ కోచ్‌గా విక్రమ్‌ రాఠోడ్, బౌలింగ్‌ కోచ్‌ పరాస్‌ మాంబ్రే కాంట్రాక్ట్‌ను బీసీసీఐ పొడిగించనుంది. ద్రవిడ్‌ను కొనసాగించాలనే బీసీసీఐ నిర్ణయానికి కెప్టెన్‌ రోహిత్ శర్మ, చీఫ్‌ సెలక్టర్ అజిత్‌ అగార్కర్‌ కూడా మద్దతుగా ఉన్నారట. వచ్చే నెలలో దక్షిణాఫ్రికా పర్యటనకు ద్రవిడ్‌ను పంపించాలని బీసీసీఐ భావిస్తోందట. డిసెంబర్‌ 10 నుంచి జనవరి 7 వరకు దక్షిణాఫ్రికా పర్యటన కొనసాగనుంది.