
Telangana Assembly Elections 2023 : నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటు హక్కు పొంది తొలిసారిగా ఓటు హక్కును ఉపయోగించుకునేందుకు యువ ఓటర్లు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే యువ ఓటర్లకు ఎన్నికల కమిషన్ వార్నింగ్ ఇచ్చింది. ఓటు వేయాలనే యువత ఉత్సాహం, ఓటు వేసిన ఆనందంతో పోలింగ్ బూత్ ల దగ్గర హడావుడి చేసి సెల్ఫీలు తీసుకుని వాటిని సోషల్ మీడియాలో పెట్టే వారికి ముందుగానే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో పోలింగ్ కేంద్రాల దగ్గర సెల్ఫీలు తీసుకోకూడదని.. అలాంటి చర్యలకు ఎవరైనా పాల్పడితే అరెస్ట్ చేస్తామంటున్నారు.
తెలంగాణలో గురువారం ఉదయం 7గంటల నుంచి ప్రారంభమైంది. పోలింగ్ కోసం కొత్తగా ఓటు హక్కు పొందిన వాళ్లతో పాటు తొలిసారిగా ఓటు వేస్తున్న వారిలో కొందరు అత్యుత్సాహం ప్రదర్శించే అవకాశం చాలా ఉంది. అలాంటి వారికి పోలీసులు, ఎన్నికల అధికారులు సున్నితంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఓటు వేసిన తర్వాత తాము ఓటు వేశామని అందరికి చెప్పుకునేందుకు.. పోలింగ్ కేంద్రం దగ్గరే సెల్ఫీలు తీసుకొని వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అయితే ఈసారి అలాంటివి కుదరదని అధికారులు గట్టిగా చెప్పేస్తున్నారు.