posted on Nov 30, 2023 11:02AM
అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్‌కు అవకాశం ఇవ్వలేదని, దీంతో తాము ఓటు వేసే హక్కును కోల్పోతున్నామని ఉపాధ్యాయ సంఘాలు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. ఈ పిటిషన్‌కు సంబంధించి హైకోర్టులో విచారణ గురువారం ముగిసింది. ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగులు.. పోస్టల్ బ్యాలెట్ కోసం దరఖాస్తు చేసుకుంటే కనుక వారందరికీ ఆ మేరకు సౌకర్యం కల్పించామని ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నెల 28వ తేదీ వరకు లక్షా డెబ్బై ఐదు వేల మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకున్నట్లు కోర్టుకు తెలిపారు. ఎన్నికల కమిషన్ తరఫు న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకొని విచారణను ముగిస్తున్నట్లు హైకోర్టు తెలిపింది.
అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశాన్ని తొలిసారిగా 13 శాఖల ఉద్యోగులకు కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నది. పోలింగ్ రోజు విధి నిర్వహణలో ఉండే జర్నలిస్ట్‌లకూ ఈ సౌకర్యాన్ని కల్పించింది. ఇప్పటి వరకు పోలింగ్ విధుల్లో ఉన్న ఉద్యోగులు, ఆర్మీ వారికి మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఓటు వినియోగించుకునే అవకాశం ఉంది. కొన్నేండ్లుగా అత్యవసర సర్వీసులు అందించే శాఖల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ ఉంది.