
PM Modi: కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్-28 వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ యూఏఈకి వెళ్లారు. COP28 సందర్భంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. ఇజ్రాయిల్-హమాస్ యుద్ధ నేపథ్యంలో ప్రధాని భేటీ చర్చనీయాంశం అయింది. హమాస్ యుద్దంలో ప్రభావితమైన ప్రజలకు మానవతా సాయం నిరంతరం అందించాల్సిన అవసరాన్ని ప్రధాని మరోసారి పునరుద్ఘాటించారు.
Read Also: Electricity bill: రూ.5000 కరెంట్ బిల్లుకు, రూ. 195 కోట్ల రసీదు.. ఏం జరిగిందంటే..?
ఇజ్రాయిల్-హమాస్ వివాదంపై ఇరువురు నేతలు చర్చించుకున్నట్లు, అక్టోబర్ 07 నాటి ఉగ్రవాద దాడిలో జరిగిన ప్రాణనష్టానికి ప్రధాని మోడ సంతాపాన్ని వ్యక్తం చేసినట్లు, బందీల విడుదలను స్వాగతించినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ఎక్స్(ట్విట్టర్)లో వెల్లడించారు. టూ స్టేట్ పరిష్కారానికి ఇజ్రాయిల్, పాలస్తీనా సమస్యను దౌత్య మార్గాల్లో పరిష్కరించుకోవాలని ప్రధాని మోడీ సూచించారు. అంతర్జాతీయ మానవతా చట్టాన్ని పాటించాల్సిన సార్వత్రిక బాధ్యత ఉందని, ఉగ్రవాదంపై పోరు చేయాల్సిన అవసరం ఉందని భారతదేశం పేర్కొంది. ఈ సదస్సులో భాగంగా శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘేతో ప్రధాని శుక్రవారం భేటీ అయ్యారు.
అక్టోబర్ 7 నాటి దాడిలో హమాస్, 1200 మంది ఇజ్రాయిలీలను చంపేసింది. దీంతో పాటు 240 మందిని బందీలుగా గాజాలోకి తీసుకెళ్లింది. అప్పటి నుంచి ఇజ్రాయిల్ గాజా స్ట్రిప్‌పై దాడులు చేస్తోంది. ఈ దాడుల్లో 16 వేల మంది పాలస్తీనియన్లు మరణించారు. గత శుక్రవారం నుంచి ఇరు పక్షాలు సంధి ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ రోజుతో సంధి ముగిసింది. మరోసారి యుద్ధం ప్రారంభమైంది.