Leading News Portal in Telugu

Minister Meruga Nagarjuna: జగన్ ప్రభుత్వంలో దళితుల తలరాతలు మారాయి..


Minister Meruga Nagarjuna: జగన్ ప్రభుత్వంలో దళితుల తలరాతలు మారాయి..

Minister Meruga Nagarjuna: పేద పిల్లలకు అంతర్జాతీయ స్థాయి విద్య అందిస్తుంటే చంద్రబాబుకు కనిపించటం లేదని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు. ఏదో విధంగా ఎస్సీలను మోసం చేయాలనే దుష్ట ఆలోచన చంద్రబాబుది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు అధికారం ఇస్తే అన్ని వర్గాలను మోసం చేశాడని.. చంద్రబాబు హయాంలో దళితులు అలో లక్ష్మణ అంటూ బతికారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలో దళితుల తలరాతలు మారాయని.. గౌరవంతో బతుకుతున్నామని వారు అంటున్నారని మంత్రి తెలిపారు. దళిత క్రైస్తవులు చంద్రబాబుకు కనిపించారా అంటూ ప్రశ్నించారు.

దళిత క్రైస్తవులను దళితులకు అందే హక్కులు ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాసిన నాయకుడు జగన్ అంటూ మంత్రి తెలిపారు. రాజధాని ప్రాంతంలో పేదవారికి ఇళ్ళ స్థలాలు ఇస్తే అడ్డుకున్నది ఎవరంటూ మంత్రి ప్రశ్నించారు. పేదవారికి ఇళ్ళ స్థలాలు ఇస్తే డెమోగ్రాఫిక్ ఇన్‌బాలెన్స్ వస్తుందని చంద్రబాబు కోర్టుకు ఎక్కలేదా అంటూ ప్రశ్నలు గుప్పించారు. అంబేద్కర్ భావజాలాన్ని అణగదొక్కాలని చూసింది చంద్రబాబు అంటూ ఆరోపించారు. ప్రపంచం గర్వించే విధంగా విజయవాడలోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మిస్తున్నారు సీఎం జగన్ అని మంత్రి వెల్లడించారు.

చంద్రబాబు హయాంలో జరిగిన కారంచేడు, నీరుకొండ ఘటనలను ప్రజలు మర్చిపోలేదన్నారు. చంద్రబాబు హయాంలో దళితుల మీద దాడుల్లో రాష్ట్రం దేశంలోనే నాల్గవ స్థానంలో ఉండేదని.. జగన్ సామాజిక సాధికారతకు ప్రయత్నం చేస్తుంటే కనిపించటం లేదా అంటూ ప్రశ్నించారు. పేద వాళ్ళను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయటం చంద్రబాబు మానాలని హితవు పలికారు. దళితులకు మా ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై ఎవరు చర్చకు వచ్చినా సిద్ధమని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు.