Leading News Portal in Telugu

CEO VikasRaj: తెలంగాణలో 70.92 శాతం పోలింగ్ జరిగింది..


CEO VikasRaj: తెలంగాణలో 70.92 శాతం పోలింగ్ జరిగింది..

తెలంగాణలో గురువారం 119 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. చెదురుమదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రశాంతంగా సాగింది. ఈ సందర్భంగా సీఈఓ వికాస్ రాజ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు. పలుచోట్ల ఈవీఎంల మొరాయించాయి.. అవి తమ దృష్టికి రాగానే ఈవీఎంలను మార్చినట్లు పేర్కొన్నారు. ఈరోజు స్క్రూటిని జరుగుతుందని చెప్పారు.

నిన్న(గురువారం) రాత్రి 70.6 శాతం పోలింగ్ నమోదు అయిందని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. అత్యధికంగా మునుగోడు నియోజకవర్గంలో 91.5 శాతం పోలింగ్ నమోదైందని.. అత్యల్పంగా రంగారెడ్డి జిల్లా యాకత్ పురలో 39.6 శాతం పోలింగ్ జరిగిందని ఆయన చెప్పారు. ఇదిలా ఉంటే.. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద మూడంచెల భద్రత ఉందని తెలిపారు. 40 కంపెనీల కేంద్ర రక్షణ బలగాలు స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఉంటారని ఆయన పేర్కొన్నారు.

కాగా.. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో1766 టేబుల్స్ ఉంటాయి. 131 పోస్టల్ బ్యాలెట్ టేబుల్స్ ఉంటాయని వికాస్ రాజ్ చెప్పారు. అయితే.. కౌంటింగ్ ప్రక్రియ కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇదిలా ఉంటే.. 6 నియోజకవర్గంలో 500 పైగా పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ కౌంటింగ్ కోసం 28 టేబుల్స్ ఉంటాయన్నారు. ఇదిలా ఉంటే.. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుందని చెప్పారు.