జగనాసుర పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కోసమే పొత్తు.. వ్యతిరేకించేవారంతా వైసీపీ కోవర్టులే! | pawan kalyan say people oppose alliance are ycp coverts| tdp| janasena| ap| jagan| rule
posted on Dec 2, 2023 2:25PM
తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తు ఎంత దృఢంగా ఉందో, ఎంత దృఢంగా ఉండబోతోందో జనసేనాని పవన్ కల్యాణ్ విస్పష్టంగా ఎలాంటి సందేహాలకూ తావులేని విధంగా చెప్పేశారు. ఈ పొత్తును విచ్ఛిన్నం చేయడానికి వైసీపీ పన్నుతున్న కుట్రలను సైతం కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. జనసేనలో తెలుగుదేశంతో పొత్తును వ్యతిరేకించే వారంతా వైసీపీ కోవర్టులేనని తేల్చేశారు. అటువంటి వారంతా పార్టీ వీడి వెళ్లి వైసీపీలో చేరిపోవాలని నిర్మొహమాటంగా చెప్పేశారు. జనసేన తెలుగుదేశంతో పొత్తు నిర్ణయాన్ని ఆషామాషీగా తీసుకోలేదని, రాష్ట్ర భవిష్యత్, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే.. ఓ ప్రజాకంటకుడి పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడం కోసమే తెలుగుదేశంతో పొత్తు నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ పొత్తు రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మాత్రమే కాదనీ రాష్ట్ర ప్రగతి, పురోగతి, ప్రజాక్షేమం, ప్రజా సంక్షేమం దృష్ట్యా తెలుగుదేశం పార్టీతో కలిసి వేళ్లాలని నిర్ణయించాననీ చెప్పారు.
వాస్తవానికి జనసేనాని మొదటి నుంచీ కూడా స్పష్టతతోనే ఉన్నారు. బీజేపీ కలిసి వస్తుందా రాదా అన్నది పట్టించుకోకుండా.. తాను మాత్రం తెలుగుదేశంతో కలిసే ఎన్నికలకు వెడతానని చెబుతూ వస్తున్నారు. చెప్పినట్లుగానే ఆయన అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో పొత్తు ప్రకటన విషయంలో ఇంకెంత మాత్రం జాప్యం కూడదని నిర్ణయించుకున్న ఆయన రాజమహేంద్రవరంలో చంద్రబాబుతో ములాఖత్ నుంచి బయటకు వచ్చీ రాగానే సెంట్రల్ జైలు ముందే జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసే ఎన్నికలకు వెడుతుందని ప్రకటించారు. ఆ తరువాత పరిణామాలు వేగంగా ముందుకు కదిలాయి.
తెలుగుదేశం, జనసేన పార్టీలు సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకొని, ఉమ్మడి కార్యాచరణను కూడా రూపొందించుకున్నాయి. ఉమ్మడి ప్రణాళిక అమలు కూడా మొదలైంది. ఉమ్మడిగా మినీ మేనిఫెస్టో కూడా వెలువరించాయి. ఇరు పార్టీల నేతలూ కలిసికట్టుగా ప్రచారం కూడా మొదలు పెట్టారు. ప్రజా సమస్యలపై పోరాటం ప్రారంభించారు. క్షేత్ర స్థాయిలో ఇరు పార్టీల శ్రేణులూ ఉమ్మడిగానే ముందుకు కదులుతున్నాయి. అయితే, అక్కడక్కడా కొందరు జనసేన ద్వితీయ శ్రేణి నేతలు ఈ పొత్తుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. జనసేన పార్టీ పెద్దలు ఇప్పటికే ఇలాంటి వ్యాఖ్యలు చేసే వారిని పలుమార్లు హెచ్చరించారు. ఇప్పటికే కొందరు నేతలు పార్టీని వీడిపోయారు. అయితే అలా వెళ్లిపోయిన వారంతా వైసీపీ కోవర్టులుగానే జనసేనలో చేరారని.. కేవలం జనసేనపై బురద జల్లేందుకే వీరు పార్టీలో ఉంటూ వచ్చారని జనసేన వారిపై ఆరోపణలు చేసింది. అయితే ఇప్పుడు ఏకంగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పొత్తు విషయంలో కొందరు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. తెలుగుదేశంతో పొత్తును జనసేనలో ఎవరు వ్యతిరేకించినా వారంతా వైసీపీ కోవర్టులేనని, అటువంటి వారిపై చర్యలు తప్పవనీ, పార్టీ నుంచి బహిష్కరించడానికి కూడా వెనుకాడననీ తేటతెల్లం చేశారు.
మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం (డిసెంబర్ 1) నిర్వహించిన పార్టీ ఉన్నతస్థాయి నాయకుల సమావేశంలో ఏపీలో తెలుగుదేశం పార్టీతో, తెలంగాణలో బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకోవడాన్ని వైసీపీ నేతలు విమర్శించడంపై పవన్ స్పందించారు. ఎలాంటి సిద్దాంతాలు లేని పార్టీ వైసీపీకి తనను విమర్శించే అర్హత లేదన్నారు. ప్రజలకు ఏది అవసరమో అది చేస్తానన్నారు. ప్రజల కోసం ఎవరితోనైనా పొత్తు పెట్టుకుంటామన్నారు. తాను ఏ పదవులు కోరుకోలేదని.. చేసే పని, పోరాటమే గుర్తింపు ఇస్తుందని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక, తెలుగుదేశంతో పొత్తుకు వ్యతిరేకంగా ఏ స్థాయి నాయకుడు మాట్లాడినా.. కార్యకర్త మాట్లాడినా ఊరుకునేది విస్పష్ట హెచ్చరిక చేశారు. పోత్తు నిర్ణయం నచ్చనివాళ్లు ఎవరైనా ఉంటే ఇప్పుడే వైసీపీలోకి వెళ్లిపోవచ్చని తేల్చి చెప్పారు. ఇప్పటికే పొత్తులో ఉన్న బీజేపీతో కలిసి తెలంగాణ ఎన్నికలలో జనసేన పోటీలో దిగింది. ఈ విషయాన్ని ఎత్తి చూపుతూ.. జనసేనలో కొందరు ఉద్దేశపూర్వకంగా ఏపీలో పొత్తుకు, పార్టీకి వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో పవన్ ఈసారి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు.
నిజానికి వైసీపీ ఎప్పటి నుండో తెలుగుదేశం, జనసేన మధ్య పొత్తును దెబ్బతీసేందుకు చేయని ప్రయత్నం లేదు. ముందుగా జనసేనను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన వైసీపీ నేతలు, ఆ తరువాత ఎమోషనల్ గా పవన్ అభిమానులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. కానీ, ఆ పప్పులు ఉండకలేదు. అలాగే ఉద్దేశపూర్వకంగా కొందరు వైసీపీ నేతలను కోవర్టులుగా జనసేనలోకి పంపి పార్టీలో అయోమయం సృష్టంచేలా, పార్టీ విధానాలను వ్యతిరేకించే వ్యాఖ్యలు చేయించారు. అందులో భాగంగానే తెలుగుదేశంతో కలిసే ఎన్నికలకు వెళతాం అన్న పవన్ ప్రకటన తరువాత కొందరు జనసేనపై విమర్శలు చేసి పార్టీని వీడివెళ్లిపోయారు. మరికొందరిపై జనసేన చర్యలు కూడా తీసుకుంది. వాళ్లంతా వైసీపీ కోవర్టులేనని జనసేన అప్పట్లోనే స్పష్టం చేసింది. అలా పోగా మిగిలిన కొందరు ఇప్పటికీ అడపాదడపా పొత్తు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ పొత్తును వ్యతిరేకించే వారంతా వైసీపీ కోవర్టులేననీ, అటువంటి వారిని ఉపేక్షించననీ తేల్చి చెప్పేశారు.