
MLA Jakkampudi Raja: రాజకీయాలపై కనీస అవగాహన లేకుండా మాజీ ముఖ్యమంత్రి తనయుడుగా రాజకీయాల్లోకి ప్రవేశించి, రాజకీయాలను భ్రష్టు పట్టించే ప్రయత్నం లోకేష్ బాబు చేస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆరోపించారు. రాజమండ్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జెండా ఊపి ఎమ్మెల్యే రాజా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ.. వర్ధంతికి, జయంతికి తేడా తెలియని వ్యక్తి రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తాడు అని పాదయాత్రలు చేస్తే ప్రజలు నమ్మేస్థితిలో ఎవరూ లేరన్నారు.. రాష్ట్ర ప్రజలను పప్పు ఎవరు అని అడిగితే అందరి నోటా ఒకరి పేరే వినపడుతుందని అది మన లోకేష్ బాబు అని విమర్శించారు.
తండ్రికి తగ్గ తనయుడుగా సీఎం జగన్మోహన్ రెడ్డి పని చేస్తుంటే, తండ్రికి మచ్చ తెచ్చే తనయుడుగా లోకేష్ పనిచేస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన రెడ్డి అమ్మ ఒడి పథకాన్ని ప్రకటిస్తే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అది ఎలా సాధ్యమవుతుందని అవహేళనగా మాట్లాడితే అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి పథకాన్ని అమలు చేసి నిరూపించామన్నారు. అధికారంలోకి రావాలనే దురుద్దేశంతో అమ్మ ఒడి ఇద్దరు ఉంటే ఇద్దరికి ముగ్గురు ఉంటే ముగ్గురికి ఇస్తామని అసత్య ఆరోపణలతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. అమ్మఒడి ఒకరికి ఇస్తే 15వేలు, ఇద్దరికిస్తే 30 వేలు, ముగ్గురికి ఇస్తే మన లెక్కలో 45 వేలు అయితే, లోకేష్ లెక్కలో 90 వేల రూపాయలంట.. అది ఆయన జ్ఞానం? అంటూ ఆరోపించారు. లెక్కలు కూడా తెలియని వ్యక్తి నేడు పాదయాత్రలు చేసి రాష్ట్రాన్ని ఉద్ధరిస్తానంటే ప్రజలు నమ్మే స్థితిలో ఎవరు లేరు అన్నారు. ఇప్పటికైనా బూటకపు పాద యాత్రలు ఆపాలని లోకేష్‌కు హితవు పలికారు.