Leading News Portal in Telugu

Bunker Buster Bomb: అమెరికా నుంచి ఇజ్రాయిల్‌కి “బంకర్ బస్టర్ బాంబులు”


Bunker Buster Bomb: అమెరికా నుంచి ఇజ్రాయిల్‌కి “బంకర్ బస్టర్ బాంబులు”

Bunker Buster Bomb: ఇజ్రాయిల్, హమాస్ మధ్య మరోసారి యుద్ధం ప్రారంభమైంది. ఇటీవల వారం రోజుల పాటు ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం, సంధి కుదిరింది. హమాస్ తన చెరలో ఉన్న ఇజ్రాయిల్ బందీలను వదిలేయగా.. అందుకు ప్రతిగా ఇజ్రాయిల్ తమ జైళ్లలో పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. అయితే తాజాగా సంధి ముగియడంతో మరోసారి యుద్ధం ప్రారంభమైంది. అయితే సంధి కాలంలో గాజాస్ట్రిప్ నుంచి ఇజ్రాయిల్ పైకి దాడి జరిగింది, దీని వల్లే మళ్లీ యుద్ధం ప్రారంభమైందని అమెరికా ఆరోపిస్తోంది.

ఇదిలా ఉంటే గాజాలోని సొరంగాలు హమాస్ తీవ్రవాదులకు రక్షణగా నిలుస్తున్నాయి. వీటిని చేధించడం ఇజ్రాయిల్ సైనికులకు కష్టంగా మారింది. ప్రస్తుతం బందీలు కూడా ఈ సొరంగాల్లోనే ఉన్నట్లు ఇజ్రాయిల్ విశ్వసిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా తన అత్యాధునిక ‘బంకర్ బస్టర్ బాంబుల’ను ఇజ్రాయిల్‌కి అందించింది. అమెరికా సరఫరా చేసిన ఆయుధాల్లో దాదాపుగా 15,000 బాంబులు, 57,000 ఫిరంగి షెల్స్ ఉన్నాయి. వీటిలో 100 బీఎల్‌యూ -109 బంకర్ బస్టర్ బాంబులు ఉన్నాయి. ఇవి ఒక్కొక్కటి 2000 పౌండ్ల బరువు ఉంటుంది. ఇది ఇజ్రాయిల్ సైన్యానికి కీలకంగా మారింది.

గాజా నగరంలో ఆస్పత్రుల కింద నుంచి హమాస్ టన్నెల్ నెట్వర్క్ విస్తరించి ఉంది. ఈ బాంబులకు కాంక్రీట్ గోడల లోతుకు చొచ్చుకెళ్లే సామర్థ్యం ఉంది. హమాస్ ఉపయోగించే క్లిష్టమైన టన్నెల్ నెట్వర్క్‌ని లక్ష్యంగా చేసుకోవడానికి ఈ బాంబులు ఉపయోగపడనున్నాయి. గాజాలోని జనసాంద్రత కలిగిన జబాలియా శరణార్థి శిబిరంపై దాడి, ఈ ఆయుధాల పనే. ఈ దాడిలో 100 మందికి పైగా మరణించారు. అక్కడ ఉన్న భవనం ధ్వంసమైంది. ఈ ఆపరేషన్‌లో కీలక హమాస్ నేతను హతమార్చినట్లు ఇజ్రాయిల్ తెలిపింది. ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, సిరియా, సోమాలియా, లిబియా దేశాల్లో జరిగిన యుద్ధాల్లో యూఎస్ సైన్యం బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించి బంకర్లను ధ్వంసం చేసింది.