Leading News Portal in Telugu

Chandrababu Districts Tour: మళ్లీ జనంలోకి చంద్రబాబు.. ఈ నెల 10 నుంచి జిల్లాల పర్యటన..


Chandrababu Districts Tour: మళ్లీ జనంలోకి చంద్రబాబు.. ఈ నెల 10 నుంచి జిల్లాల పర్యటన..

Chandrababu Districts Tour: టీడీపీ అధినేత చంద్రబాబు మళ్లీ జనం బాట పట్టనున్నారు.. ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయిన ఆయన.. మధ్యంతర బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆస్పత్రి, ఇంటికే పరిమితం అయ్యారు.. శస్త్ర చికిత్స చేయించుకున్నారు.. ఆ తర్వాత రెగ్యులర్‌ బెయిల్‌ కూడా లభించింది.. ఈ మధ్య పుణ్యక్షేత్రాల పర్యటనకు శ్రీకారం చుట్టారు.. ఇక, ఈ నెల 10వ తేదీ నుంచి జిల్లాల పర్యటనలకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.. ఈలోపు రాష్ట్రంలో జరుగుతున్న ఓట్ల అక్రమాలపై ఢిల్లీ వెళ్లి సీఈసీకి ఫిర్యాదు చేయనున్నారు. పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలోనే ఢిల్లీ వెళ్లేలా చంద్రబాబు ప్లాన్‌ చేస్తున్నారనట.. డిసెంబర్ 6వ తేదీ నుంచి 8వ తేదీ లోపు తనకు సమయం కేటాయించాలంటూ సీఈసీకి లేఖ రాయనున్నారు చంద్రబాబు.

ఇక, ఈ నెల 10వ తేదీ నుంచి రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో ఏపీ పంచాయతీరాజ్‌ చాంబర్, ఏపీ సర్పంచ్‌ల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశాల్లో పాల్గొనబోతున్నారు చంద్రబాబు.. ఈ నెల 10న శ్రీకాకుళం, 11న కాకినాడ, 14న నరసరావుపేట, 15న కడపల్లో చంద్రబాబు సమావేశాలు నిర్వహించనున్నారు.. పార్టీలకు అతీతంగా సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలను ఈ సమావేశాలకు ఆహ్వానిస్తు్న్నారు.. ఒక్కో సమావేశానికి సుమారు ఐదారు వేల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నారు. మరోవైపు.. ఈ నెలలోనే చంద్రబాబు- జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కలిసి ఓ బహిరంగ సభ నిర్వహించే అవకాశం కూడా ఉందంటున్నాయి టీడీపీ శ్రేణులు. కాగా, నిన్న తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు.. ఈ రోజు విజయవాడలో ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మను దర్శించుకున్న విషం విదితమే.. నా శేష జీవితం ప్రజలకే అంకితం.. ఈ నాలుగు రోజులు రాజకీయాలు మాట్లాడబోను అని స్పష్టం చేశారు. మానవ సంకల్పానికి దేవుని ఆశీస్సులు కోసం ఈ యాత్రకు శ్రీకారం చుట్టాను అన్నారు.. రేపు సింహాచలం దర్శనం చేసుకుని, 5న శ్రీశైల దర్శనం, అనంతరం దర్గాకు కూడా వెళ్తాను అన్నారు. ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాను అని వెల్లడించారు చంద్రబాబు నాయుడు.