Leading News Portal in Telugu

జనం పాలకుల మాట వినరు..వారే జనం మాట వినాలి! | people dont listen rulers| they should| hear| kcr| defeat


posted on Dec 3, 2023 4:59PM

తెలంగాణ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం దక్కించుకుంది. పదేళ్ల తరువాత తెలంగాణలో కాంగ్రెస్ జెండాలు మళ్లీ రెపరెపలాడుతున్నాయి. ఇన్నాళ్లు బోసిపోయిన గాంధీభవన్ కళకళలాడుతోంది. ఎప్పుడూ బాధతో రగిలిన కార్యకర్తల ముఖాలు ఆనంద దరహాసాలతో వెలిగిపోతున్నాయి.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి బీఆర్ఎస్ అధికారంలో కొనసాగింది. తెలంగాణ ఇచ్చిన  పార్టీగా కాంగ్రెస్ మాత్రం కష్టాలను ఎదురీదుతూ వచ్చింది. కాంగ్రెస్ నాయకులు గత పదేళ్లుగా ఒక్క అవకాశం ఇవ్వాలని తెలంగాణ ప్రజలను వేడుకోవడం, కేసీఆర్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉండడం, రేవంత్ రెడ్డి లాంటి ఫైర్ బ్రాండ్ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టడంతో తెలంగాణలో కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతోంది. అయితే  గతంలో ఎన్నడూ కనిపించని పరిస్థితులు ఈసారి ఎన్నికల ఫలితాలలో కనిపించాయి. 

అసలు ఇప్పటి వరకూ విజయమే దక్కని స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పాగా వేయడం, కాకలు తీరిన సీనియర్లను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన యువ నాయకులు మట్టి కల్పించడం వంటివి వెలుగు చూశాయి. చాలా రకాలుగా రికార్డులు సైతం బద్దలయ్యాయి. ఇక, గ్రేటర్ హైదరాబాద్, మెదక్, సికింద్రాబాద్, నల్గొండ ప్రాంతాలలో కాంగ్రెస్ పార్టీకి మాత్రం నిరాశ తప్పలేదు. ఇక్కడ ఒక్క స్థానం మినహా మిగతా అన్ని స్థానాలనూ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. అయితే, ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్ జిల్లాలు కాంగ్రెస్ పార్టీకి కలిసి రావడంతో విజయం సాధ్యమైంది. ఏదైతేనేం మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ జెండా పాతేసింది.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చేసిన ద‌రిమిలా అధికార పార్టీ బీఆర్ఎస్ కూడా త‌న ఓట‌మిని అంగీక‌రించింది. ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ X వేదికగా కాంగ్రెస్ కు శుభాకాంక్షలు కూడా చెప్పారు.

అయితే, తెలంగాణ ప్రజలలో  కేసీఆర్ పాలనపై ఈ స్థాయిలో వ్యతిరేకత ఎలా పెరిగింది అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అనేలా బీఆర్ఎస్ ఓటమికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైన వాటిలో సీఎం కేసీఆర్ ప్రజల భావనను పట్టించుకోకపోవడం. ప్రతిపక్షాల మాట వినకపోవడం   మారిపోయింది. ఇంకా చెప్పాలంటే ప్రశ్నించే ప్రతిపక్షమే లేకుండా చేయాలనుకోవడం.  ఇక మేధావుల మాటలను కూడా కేసీఆర్ అస్సలు పట్టించుకోలేదు. ఉద్యమం సమయంలో కేసీఆర్ కు అండగా ఉంటూ నడిపించిన వారిని కూడా పక్కకి పెట్టేసి ఏకఛత్రాధిపత్యంగా అధికారం చెలాయించారు. ఎంతటి వారైనా సరే తన మాట వినకపోతే వారిని తెలంగాణ ద్రోహులుగా ముద్రవేసే ప్రయత్నం చేశారు.

ఇక చివరికి ప్రజల మాట కూడా కేసీఆర్ పట్టించుకోలేదు. గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ నియమించిన విలేజ్ డెవలప్మెంట్ కమిటీల ఆగడాలు పెచ్చుమీరాయి. వాళ్ళు చెప్పిందే వేదం అన్నట్లు పలుచోట్ల గ్రామ బహిష్కరణలు కూడా జరిగాయి. వీడీసీలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందగా.. మంత్రులు, ఎమ్మెల్యేలు కమిటీలకు మద్దతుగా నిలిచారు. ఇది సీఎం దృష్టికి కూడా వెళ్లగా.. కమిటీలు మీ మంచి కోసమే అంటూ సమర్ధించుకున్నారు. అలాగే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను  వెనక్కు తీసుకోవాలని పెద్ద ఎత్తున ప్రజలు ఉద్యమించారు.  కాన , మొండిగా కేసీఆర్ సర్కార్ ముందుకెళ్లాలని చూసింది. ధరణి పోర్టల్ మీద కూడా ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కానీ, కేసీఆర్ ధరణిని సర్వరోగ నివారిణి జాలిమ్ లోషన్ లా సర్వ సమస్యల పరిష్కారిణి అంటూ చెప్పుకు వచ్చారు.

భూస్వాములు, వందల ఎకరాల ఆసాములకు కూడా రైతు బంధు ఇచ్చారు. దీనిపై తొలి నుండి కూడా  విమర్శలున్నాయి.   మీడియా ఎన్నోసార్లు కేసీఆర్ ను ఈ విషయంలో ప్రశ్నిస్తే..   మా ప్రభుత్వమిస్తే మీకేంటయ్యా నొప్పి అంటూ చులకన చేశారు.  ఇలా ఒక్కటీ రెండూ అని కాదు..   ప్రజల తరపున గొంతు విప్పే ఎవరికీ ఆయన మర్యాద ఇవ్వలేదు సరికదా ఎగతాళి చేశారు.  కాళేశ్వరం ప్రాజెక్టు ఓ ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా డీపీఆర్ దశలో ఎందరో చెప్పారు. దాని ఖర్చు , విద్యుత్ బిల్లుల విషయంలో తొలి నుండి నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ  కేసీఆర్ తానే ఓ పెద్ద ఇంజనీర్ అనేలా అందరి నోరు మూయించారు. కాళేశ్వరం నిర్మాణంలో లోపాలతో పాటు దానికి ప్రతి నెలా వచ్చే కోట్ల విద్యుత్ బిల్లులు భారంగా మారాయి. దానికి తోడు డిజైనింగ్ లోపాలతో ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఒక గుదిబండగా మారింది.  ఇలా కేసీఆర్ తానో మోనార్క లా భావించుకుని ఎవరిమాటా వినకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు.   అయితే ప్రజలు ఏం చెబుతున్నారో, ఏం కోరుకుంటున్నారో పట్టించుకోని పాలకులను వారు మౌనంగానే అయినా తమ కున్న ఓటు హక్కుతో తిరస్కరిస్తారని మరో సారి ఈ తీర్పుతో నిరూపించారు.