ఇండియా కూటమిలో మళ్లీ లుకలుకలు? | differences in india once again| mamata| akilesh| nitesh| congress| five| states| assembly
posted on Dec 6, 2023 10:36AM
2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఓటమే లక్ష్యంగా ఏర్పడిన విపక్ష కూటమి ఇండియా.. పరిస్థితి ఒక అడుగు ముందుకు.. మూడడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతోంది. ఎన్నికలలో (బీజేపీ) ఎన్డీఎను ఓడించి, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గద్దె దింపడమే అజెండా గా ఏర్పడిన ఇండియా కూటమి లెక్కలు తప్పుతున్నాయా? తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్ తెలంగాణ వినా మరెక్కడా విజయం సాధించకపోవడంతో… కూటమి ఏకతాటిపైకి రావడానికి కారణమైన రాహుల్ జోడో యాత్ర జోష్ మసకబారిందా? అంటే పరిశీలకులు ఔననే విశ్లేషిస్తున్నారు. అసలు కూటమి ఏర్పాటు పట్టాలెక్కడానికి ముందు నుంచీ కూడా అవరోధాలు, అనుమానాలు, అడ్డంకులే. ఏదో నితీష్ పట్టుదలతో, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ చాణక్యంతో జాతీయ స్థాయిలో బీజేపీ ఏతర పార్టీలు కాంగ్రెస్ తో జట్టుకట్టడానికి ముందుకు వచ్చాయి. అయితే అలా ముందుకు వచ్చిన ప్రతి సారీ ఏదో ఒక పార్టీ కూటమి ఏర్పాటును వెనక్కు లాగుతూనే ఉంది.
తొలుత ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆ తరువాత ఇప్పుడు మమత బెనర్జీ, అఖిలేష్ యాదవ్ కూటమి ప్రయోజనాలను ఐక్యతను దెబ్బకొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రకటనలు గుప్పిస్తున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ సారథ్యంలో సారధ్యంలో, ఆయనే అనుసంధానకర్తగా బీజేపీ వ్యతిరేక విపక్ష పార్టీల తొలి సమావేశం పాట్నాలో జరిగింది. ఆ తర్వాత బెంగుళూరులో జరిగిన రెండవ సమావేశంలో ఇండియాగా పేరు పెట్టుకుంది. ఆ పేరును రాహుల్ గాంధీయే సూచించారని చెబుతారు. ఆ వెంటనే ముంబైలో మూడవ సమావేశం కూడా జరిగింది. కానీ ఈ సమావేశం తరువాత నుంచీ నతీష్ కుమార్ ఒకింత అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. అందుకు కారణం కూటమిని తమ గుప్పిట్లోకి తీసుకోవాలనే నితీష్ ఆకాంక్షకు విరుద్ధంగా రాహుల్ జోడో యాత్ర జోష్ తో కూటమి పార్టీలన్నీ కాంగ్రెస్ వెనుక ర్యాలీకి కావడానికి సిద్ధపడటమే. దీతోనే తాను అనుసంధానకర్తగా ఆవిర్భవించిన ఇండియా కూటమి లక్ష్యలకు విరుద్ధంగా ఆయన అడుగులు వేశారని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. అందుకు కారణం కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ బహిష్కరించిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసిన జీ20 విందు సమావేశానికి నితీష్ హాజరు కావడమే. అంతే కాదు ఆ విందు సమావేశంలో ఆయన మోడీతో ముచ్చటించారు. దీంతో నితీష్ తిరిగి బీజేపీకి దగ్గరౌతున్నారా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
సరే అదలా ఉంచితే.. తాజాగా వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెైస్ పూర్ పెర్ఫార్మెన్స్ ఇండియా కూటమి అడుగులు ముందుకు పడేందుకు మరో అవరోధంగా మారింది. బుధవారం జరగాల్సిన ఈ కూటమి భేటీకి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హాజరు కాలేమనడంతో భేటీ వాయిదా పడింది. ఈ నెల మూడో వారంలో ఇండియా కూటమి భేటీ అయ్యే అవకాశం ఉంది. అయితే నేటి భేటీ వాయిదాకు కారణం మాత్రం కాంగ్రెస్ నాయకత్వంలో పని చేసేందుకు మమత, అఖిలేష్ వంటి వారి నిరాసక్తతే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.