Leading News Portal in Telugu

Deepak Chahar: దక్షిణాఫ్రికా టూర్‌కు దీపక్ చహర్ దూరం.. వదిలి వెళ్లలేనంటూ భావోద్వేగం!


Deepak Chahar: దక్షిణాఫ్రికా టూర్‌కు దీపక్ చహర్ దూరం.. వదిలి వెళ్లలేనంటూ భావోద్వేగం!

Deepak Chahar Set To Miss India Tour Of South Africa: భారత పేసర్ దీపక్ చహర్ దక్షిణాఫ్రికా పర్యటనకు దూరమయ్యే అవకాశం ఉంది. బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన తండ్రి లోకేంద్ర సింగ్ కోలుకునే వరకు ఆయన వెంటే ఉంటానని దీపక్ తాజాగా వెల్లడించాడు. ఇదే విషయాన్ని కోచ్ రాహుల్ ద్రవిడ్ మరియు బీసీసీఐ సెలెక్టర్లకు తెలియజేసినట్లు చెప్పాడు. తనని క్రికెటర్‌గా తీర్చిదిద్దిన తండ్రిని ఈ స్థితిలో వదిలి వెళ్లలేని దీపక్ స్పోర్ట్స్ టాక్‌తో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యాడు.

డిసెంబరు 2న అలీఘర్‌లో ఒక వివాహ వేడుకలో ఉండగా.. దీపక్ చహర్ తండ్రి లోకేంద్ర సింగ్ బ్రెయిన్ స్ట్రోక్‌కు గురయ్యాడు. వెంటనే అతడిని అలీఘర్‌లోని మిత్రరాజ్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన దీపక్.. భారత జట్టును వీడి వెంటనే ఇంటికి (అలీగఢ్‌కు) బయలుదేరాడు. దాంతో ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ20 ఆడలేదు. మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా దీపక్ ఈ మ్యాచుకు అందుబాటులో లేడని టాస్ సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. త్వరలో దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే, టీ20 సిరీస్‌లకు ఎంపికైన దీపక్‌.. ఇప్పుడు తప్పుకున్నాడు.

‘మా నాన్నను సకాలంలో ఆస్పుత్రిలో చేర్చాం. లేకుంటే ఆయన పరిస్థితి ప్రమాదకరంగా ఉండేది. ప్రస్తుతం అతని పరిస్థితి మెరుగ్గా ఉంది. ఆస్ట్రేలియాతో నేడు చివరి టీ20 మ్యాచ్ ఎందుకు ఆడలేదని ఎంతోమంది అడిగారు. నాకు మా నాన్న ముఖ్యం. క్రికెటర్‌గా నన్ను ఆయనే తీర్చిదిద్దాడు. ఈ స్థితిలో ఆయన్ని వదిలి వెళ్లలేను. నేను మా నాన్న దగ్గరే ఉండాలని నిర్ణయించుకున్నా. నాన్న కోలుకున్న తర్వాత దక్షిణాఫ్రికాకు వెళ్తాను. ఈ విషయాన్ని కోచ్ రాహుల్ ద్రవిడ్, బీసీసీఐ సెలక్టర్లకు చెప్పా’ అని దీపక్ చహర్ తెలిపాడు.

గాయాల కారణంగా ఈ ఏడాది భారత జట్టు తరఫున దీపక్ చహర్ పెద్దగా ఆడలేదు. అతను చివరిసారిగా డిసెంబర్ 2022లో భారత్ తరపున వన్డే ఆడాడు. ఆస్ట్రేలియాతో 4వ టీ20కి ముందు చివరి టీ20 అక్టోబర్ 2022లో దక్షిణాఫ్రికాతో ఆడాడు. దక్షిణాఫ్రికాతో భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. డిసెంబర్ 10న ఇరు జట్ల మధ్య తొలి టీ20 జరగనుంది.