Leading News Portal in Telugu

కేసీఆర్ విద్యుత్ మాయ.. ట్రాన్స్ కో జెన్ కోల దుస్థితికి కారణం అదే! | kcr spoil power sector| production| purchase| debts


posted on Dec 9, 2023 9:53AM

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కె. చంద్రశేఖర రావుకు  రాజకీయ లబ్ధిపై దృష్టే తప్ప దార్శనికత అంటే దూర దృష్టి లేదని.. ఆయన అధికారం నుంచి దూరమైన  రెండో రోజే లోకానికి వెళ్లడైంది. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ అంటూ ఆయన అధికారంలో ఉన్నంత కాలం ఊదరగొట్టేశారు. అయితే ఆ పేరుతో విద్యుత్ రంగాన్ని ఎంతగా అప్పుల ఊబిలో కూరుకుపోయారో కొత్త ముఖ్యమంత్రి రేవంత్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే తేటతెల్లమైపోయింది. తెలంగాణ నిర్మాణం అంటూ ఆయన చేసిన ప్రసంగాలన్నీ ఓట్లు దండుకునే రాజకీయ విన్యాసాలే వినా.. రాష్ట్రం నిజమైన ప్రగతి కోసం ఆయన చేసిందేమీ లేదనడానికి ఆయన అనుసరించిన విద్యుత్ విధానమే నిదర్శనమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అసలు ఒక్క విద్యుత్ రంగం అనే కాదు దాదాపుగా రాష్ట్రంలోని అన్ని సంస్థలు, రంగాల పరిస్థితీ అదేనని పరిశీలకులు చెబుతున్నారు.  

ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి  ప్రమాణ స్వీకారం చేసి, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌లో దాదాపు రెండు గంటలు కరెంట్‌ పోయింది.  అందుకు కారణాలేమిటని చూడకుండానే బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ రాగానే కరెంట్ కోతలు షూరూ అంటూ ప్రచారం ఆరంభించేశారు.   ఇప్పుడు కూడా ఆ కారణాల సంగతి కొంచం సేపు పక్కన పెట్టి విద్యుత్ విషయంలో కేసీఆర్ హ్రస్వదృష్టి ఏమిటన్నది చూద్దాం. విద్యుత్తు విషయంలో కుట్ర జరుగుతున్నదని  టీపీసీసీ చీఫ్ గా రేవంత్‌ రెడ్డి పలు సందర్భాలలో  అప్పటి కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించిన సంగతి తెలిసిందే. 

 ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే రేవంత్ విద్యుత్ రంగంపైనే దృష్టి పెట్టారు. సీఎంగా ఆయన నిర్వహించిన తొలి సమీక్ష కూడా విద్యుత్ పైనే. ఆ సందర్భంగా అధికారులు ఇచ్చిన పవర్ పాయింట్ లో  కేసీఆర్ విద్యుత్ మాయ బట్టబయలైంది. విద్యుదుత్పాదనపై కాకుండా కేసీఆర్ విద్యుత్ కొనుగోలుపైనే ఎక్కువ శ్రద్ధ పెట్టారు. ఎక్కువ వ్యయం కూడా చేశారు. అందుకే విద్యుత్ రంగం అప్పుల ఊబిలో కూరుకుపోయింది. 

ట్రాన్స్ కో , జెన్ కోలకు కలిపి 81వేల516 కోట్ల రూపాయల అప్పు ఉంది. అదే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నాటికి ఈ అప్పులు 22 వేల 422 కోట్లు. దీనిని బట్టి చూస్తేనే కేసీఆర్ హయాంలో విద్యుత్ అప్పులు ఏ స్థాయిలో పెరిగాయో అవగతమౌతుంది. సరే అప్పులు చేశారు, మరి ఆదాయం మాటేమిటంటే.. దాని గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు.  3వేల పై చిలుకు కోట్లు, అది కూడా ప్రభుత్వం ఇచ్చే నిధులను కూడా కలుపుకుంటే. దీనిని బట్టే కేసీఆర్ తీరు ఏమిటన్నది అవగతమౌతుంది. 

తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యుత్ రంగ నిపుణులు ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్ర ఆవిర్భావం తరువాత విద్యుత్ రంగంలో తీసుకోవలసిన చర్యలపై కూడా వారు అప్పట్లో ప్రస్తావించేవారు. అయితే తెలంగాణ ఆవిర్భావం తరువాత.. రాష్ట్ర సాధకుడిగా క్రెడిట్ మొత్తం తన ఖాతాలో వేసుకున్న కేసీఆర్.. ఉద్యమ సమయంలో తన వెంట నడిచిన వారందరినీ పక్కకు నెట్టేశారు. అలా నెట్టేసిన వారిలో వివిధ రంగాలకు చెందిన నిపుణులు కూడా ఉన్నారు. అలాగే విద్యుత్ రంగ నిపుణులు కూడా. దీంతోనే తెలంగాణ కర్త, కర్మ, క్రియా అన్నీ తానే అన్నట్లుగా వ్యవహరించిన కేసీఆర్.. నిజమైన ప్రగతి కంటే ఓట్లు తెచ్చిపెట్టేలా  జనాలను ఆకర్షించడంపైనే పూర్తిగా ఆధారపడ్డారు. వ్యవస్థలు కుప్ప కూలే పరిస్థితి ఉన్నా దాచి.. ఇది సాధించాం, ఇంత సాధించేశాం అని ప్రసంగాలు ఇచ్చే వారు.

ఆయన అధికార పాఠం నుంచి దూరమైన తరువాత ఒక్కొక్కటిగా ఆయన ఏరకంగా రంగాలను, సంస్థలను నిర్వీర్యం చేసేశారో బయటపడుతోంది. తొలుత విద్యుత్ రంగం ఎలా అప్పుల ఊబిలో కూరుకుపోయిందో బయటకు వచ్చింది.  ప్రజలకు ఫ్రీబీస్ ఇచ్చేస్తే చాలు ఇక వారు తన మాట జవదాటరు అన్న కేసీఆర్ అహంకార పూరిత వైఖరే  ప్రస్తుత పరిస్థితికి కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక్క విద్యుత్ రంగం అనే కాదు.. ఒకదాని తరువాత ఒకటిగా అన్ని రంగాలదీ ఇదే పరిస్థితి అంటున్నారు.