Leading News Portal in Telugu

ప్రొటెం స్పీకర్ గాఅక్బరుద్దీన్ కు అవకాశం వెనుక కాంగ్రెస్ వ్యూహం ఏమిటి? | strategy behind congress| chance| protem| speaker


posted on Dec 9, 2023 12:45PM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ రోజు  ప్రారంభమయ్యాయి. కొత్తగా రేవంత్ రెడ్డి  అధికార పగ్గాలు అందుకున్న తరువాత జరుగుతున్న తొలి సమావఏశాలివి. ఈ సమావేశాలు మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. శనివారం (డిసెంబర్ 9)అసెంబ్లీ సమావేశాల తొలి రోజు అంతా దాదాపుగా కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారంతోనే సరిపోవచ్చు. ఆ తరువాత బీఏసీ సమావేశాలలో సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి? అజెండా ఏమిటి అన్నది నిర్ణయిస్తారు.

సరే అదంతా రొటీన్ గా జరిగే వ్యవహారమే. అసలు ఎలాంటి వివాదాలూ, విమర్శలకూ తావు లేకుండా జరగాల్సిన ప్రొటెం స్పీకర్ వ్యవహారం ఎందుకు వివాదాస్పదంగా మారింది. ఒక రోజు భాగ్యానికి బీజేపీ అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ గా ఎందుకు వ్యతిరేకించింది. అలాగే  ప్రభుత్వం కూడా సాంప్రదాయాన్ని అనుసరించి సభలో సీనియర్ మోస్ట్ లలో ఎవరో ఒకరిని కాకుండా అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ గా ఎందుకు నిర్ణయించింది? అలా నిర్ణయించడం ద్వారా బీజేపీకి తొలి రోజు సమావేశాలను బహిష్కరించే అవకాశం ఇచ్చినట్లైంది కదా? సభలో అక్బరుద్దీన్ కంటే సీనియర్ హరీష్ రావు ఉన్నారు. లేకపోతే.. అక్బరుద్దీన్ తో సమానమైన సీనియారిటీ ఉన్న బీఆర్ఎస్ నేతలు ఇద్దరున్నారు.

కేసీఆర్ కాకుండా  విపక్షం నుంచి సీనియర్ ఎమ్మెల్యే అయిన మాజీ స్పీకర్ పోచారం ఉన్నారు. వీరందరినీ కాదనీ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ కు ఎందుకు అవకాశం దక్కింది. సాధారణంగా ప్రధాన విపక్షం నుంచే సీనియర్ ఒకరికి ప్రొటెం స్పీకర్ గా అవకాశం ఇస్తారు. కానీ కాంగ్రెస్ ఒకింత భిన్నంగా వ్యవహరించింది.   కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేయించడం మాత్రమే ప్రొటెం స్పీకర్ పని. కాకపోతే సీనియారిటీని సంప్రదాయం మేరకు ఇచ్చే గౌరవానికి ప్రతీకగా ప్రొటెం స్పీకర్ ను ఎన్నుకుంటారు. ప్రొటెం స్పీకర్ చేత రాజ్ భవన్ లో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు.  ఆ తరువాత కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించడంతో ప్రొటెం స్పీకర్ పని ముగుస్తుంది. స్పీకర్ ఎన్నికకు నోటిషికేషన్ వెలువడుతుంది. సభ్యులు కొత్త స్పీకర్ ను ఎన్నుకుంటారు. అయితే ప్రొటెం స్పీకర్ గా హరీష్ రావుకు కానీ, బీఆర్ఎస్ లో సీనియర్లకు కానీ అవకాశం ఇవ్వకపోవడమే ఇప్పుడు చర్చకు, వివాదానికీ తావిచ్చింది. 

ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నిట్టనిలువుగా చీలేందుకు అవకాశం ఉందన్న ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో  బీఆర్ఎస్ మనో స్థైర్యాన్ని మరింత తగ్గించే వ్యూహంతోనే అక్బరుద్దీన్ కు ప్రొటెం స్పీకర్ అవకాశం ఇచ్చి ఉంటారని పరిశీలకులు చెబుతున్నారు. ఇక బీజేపీ సమావేశాల తొలి రోజు బహిష్కరణ పెద్ద విషయం కాదని పరిశీలకులు అంటున్నారు.