ఆపత్సమయంలోనూ అబద్ధాలేనా సీఎం జగన్?! | jagan lie in tupan situation also| help| secrateriat| phone| 1092| babu
posted on Dec 9, 2023 2:04PM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల హడావుడితో ఒకింత తగ్గినట్టుగా కనిపించిన ఏపీ పొలిటికల్ హీట్ మళ్ళీ పెరుగుతున్నది. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు ముందు రాష్ట్రంలో అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఒక దశలో వైసీపీకి గుక్క తిప్పుకునే అవకాశం ఇవ్వకుండా టీడీపీ నేతలు మాటలతోనే ఉక్కిరిబిక్కిరి చేసేశారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షాల దండయాత్రతో అధికార పార్టీకి ఏం చేయాలో కూడా అర్ధంకాని పరిస్థితికి చేరింది. అలాంటి సమయంలో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయించి సీఎం జగన్ తమ కక్షసాధించుకున్నారు. అయితే, అది జగన్ కు మరింత నష్టమే తెచ్చిందనుకోండి అది వేరే విషయం. మొత్తంగా చంద్రబాబుకు బెయిల్ దక్కడంతో మళ్ళీ ప్రజల మధ్యకి వచ్చి అండగా నిలబడడం మొదలు పెట్టారు. ఏపీని నాలుగు రోజుల పాటు మిచౌంగ్ తుఫాన్ అల్లల్లాడించి పోయిన సంగతి తెలిసిందే. తుఫాన్ సమయంలో జగన్ ప్రభుత్వం ఏమీ చేయలే దన్నది నిజం. తుఫాన్ వెళ్ళిపోయాక తీరిగ్గా వైసీపీ నేతలు ప్రజలు మధ్యకి వచ్చారు. కానీ, అప్పటికే ఆలస్యమైపోయింది. తుఫాన్ తీరం దాటాక కూడా రెండు మూడు రోజుల వరకూ పరిస్థితులు చక్కబడలేదు.
తుఫాన్ బాధితులను పరామర్శించేందుకు, అసలు తుఫాన్ ప్రభావాన్ని తెలుసుకొనేందుకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రజల మధ్యకే వెళ్లారు. దాదాపు మూడు నెలల తరువాత ఆయన జనం మధ్యకు వచ్చారు. అదీ ఆపత్సమయంలో ప్రజలకు భరోసా ఇచ్చేందుకు. దీంతో కంగారుపడిన సీఎం జగన్ కూడా అదే రోజున తుఫాన్ బాధితులను పరామర్శించేందుకు వెళ్లారు. అయితే, చంద్రబాబు పంట పొలాల నుండి ప్రజలు ఇబ్బందులు పడుతున్న వాడల వరకూ వెడితే.. ముఖ్యమంత్రి జనగ్ మాత్రం ఈ కార్యక్రమాన్ని కూడా ఒక పార్టీ సభలా మార్చేసుకున్నారు. తుఫాన్ బాధితులను పరామర్శించేందుకు వెళ్లడం అటుంచి.. బాధల్లో ఉన్న జనాలనే తన దగ్గరకు రప్పించుకున్నారు. ఇంకా క్లియర్ కట్ గా చెప్పాలంటే బలవంతపు జనసమీకరణ చేశారు. సరే అలాగైనా తుపాను బాధితులకు ఏమైనా స్పష్టమైన సహాయం ప్రకటించారా? ధీమా ఇచ్చారా? భరోసా కల్పించారా అంటే అదేం లేదు. ఒక ఎన్నికల ప్రచార సభలా సీఎం సభ జరిగింది. ప్రతిపక్షాల మాటలను నమ్మొద్దని, చంద్రబాబు పాలన అంతా కరువు కాటకాలేనంటూ విమర్శలకు దిగారు. తుపాను బాధితులను పరామర్శించడానికి వెళ్లిన జగన్ వారి వద్దకు వెళ్లకుండా సభ పెట్టారు. ఆ సభను కూడా తన బటన్ నొక్కుడు సభగా మార్చేశారు. ప్రతిపక్షాలను విమర్శించి చేతులు దులిపేసుకున్నారు. బాధితులందరికీ సాయం అందుతుందని.. ఎక్కడికక్కడ సచివాలయాలు బాధితులకు అండగా ఉంటాయని.. వారే ఇంటింటికీ వచ్చి సాయం అందిస్తారనీ జగన్ చెప్పుకొచ్చారు.
అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు తెలిసిన వారికి సీఎం చెప్పిన ఒక్క మాట కూడా నెరవేరే అవకాశం లేదని తెలిసిపోయింది. తుఫాన్ బాధితుల సభలో మాట్లాడిన సీఎం.. గ్రామ స్థాయిలో సచివాలయ వ్యవస్థతో ప్రతీ ఇంటికీ నేరుగా వచ్చి సహాయ కార్యక్రమాలు అందిస్తున్నామని చెప్పుకున్నారు. మీ బిడ్డ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. ఎవరో ఏదో చెబితే నమ్మవద్దు.. అసలు ఆ టీడీపీ అనుకూల పత్రికలు చదవవద్దని చెప్పారు. ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు. మీకు సాయం అందకపోతే నేరుగా 1902 నంబర్ కే ఫోన్ చేయండి.. అది నేరుగా సీఎం ఆఫీస్ కే వస్తుందని కూడా జగన్ చెప్పారు. ఏపీలో తమ ప్రభుత్వం ఎంతో మంచి చేస్తూంటే చూసి ఓర్వలేని వారు బురద జల్లుతున్నారని జగన్ ఆవేదన చెందారు. మండిపడ్డారు. అయితే, జగన్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
తుఫాన్ బాధితుల పరామర్శ కోసం వెళ్లిన సీఎం బాధితులకు భరోసా ఇవ్వాలి. కానీ తనదేం లేదు అన్నీ సచివాలయాలు చూసుకుంటాయని చెప్పారు. తుఫాన్ సమయంలో ఆ సచివాలయ ఉద్యోగులే కార్యాలయాలకు రాలేదు. ఆ తర్వాత కూడా సహాయక చర్యలకు తగిన కార్యాచరణ రూపొందించలేదు. ప్రజల గురించి పట్టించుకోలేదు. ఇక సాయం అందించేందుకు ఎక్కడా తగిన సమాచారం కూడా సేకరించలేదు. అదే విషయాన్ని ప్రతిపక్షాలు ఎత్తి చూపుతున్నాయి. కానీ జగన్ వాళ్ళని నమ్మవద్దంటూ తనకు అలవాటైన విమర్శలు చేసేశారు. ఆపద సమయంలో అధికారంలో ఉండి తుపాను బాధితులను ఆదుకునేందుకు తామేం చేశాం, ఏం చేయబోతున్నాం అన్నది చెప్పాల్సిన చోట జగన్ గత ప్రభుత్వాన్ని విమర్శించి చేతులు దులిపేసుకున్నారు.
ఇక 1902 నంబర్ కి కాల్ చేస్తే సీఎంఓకి వస్తుందని.. మీ సమస్యలు తీరతాయని జగన్ నిస్సంకోచంగా పచ్చి అబద్దం చేప్పేశారు. వాస్తవంగా ఆ నంబర్ కి కాల్ చేసే ఫిర్యాదులు తీసుకుని సంబంధిత శాఖకి పంపిస్తారు. కానీ ఆ శాఖ అధికారులు మాత్రం తమ దగ్గర సమస్య పరిష్కరించేందుకు తగిన సౌకర్యాలు లేవని చెప్తున్నారు. ఉదాహరణకి ఏపీలో అనధికారిక విద్యుత్ కోతలపై 1902కి కాల్ చేస్తే ఫిర్యాదు తీసుకొని సంబంధిత అధికారికి కలుపుతారు. అధికారి మాత్రం ఎందుకు విద్యుత్ కోతలు విధిస్తున్నారో తమకి కూడా సమాచారం లేదని చెప్తున్నారు. సాధారణ రోజుల్లోనే పరిస్థితి ఇలా ఉంటే.. ఇక తుఫాన్ లాంటి ఆపత్సమయాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందుకే జగన్ వ్యాఖ్యలపై నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు. విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆపత్సమయంలోనే పచ్చి అబద్ధాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడమేమిటంటూ నిలదీస్తున్నారు.