ఏపీ కాంగ్రెస్ లోకి షర్మిల? ఏం జరుగుతుందంటే..? | sharmila into ap congress| what| will| happen| ycp| weak| congress| opposition| leaders
posted on Dec 11, 2023 4:35PM
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి ఇక నూకలు చెల్లినట్లేనా? ఇప్పటికే తీవ్ర అసంతృప్తితో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు, శ్రేణులు గంపగుత్తగా వెళ్లి పోవడానికి ఒక పార్టీ రెడీ అవుతోందా? అంటే జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అదే జరుగుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.ఇంతకీ వైసీపీని అంతగా బెంబేలెత్తిస్తున్న ఆ పార్టీ ఏమిటయ్యా అంటే.. అదేమీ కొత్తగా పుట్టుకొచ్చిన పార్టీ కాదు. దశాబ్దాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యంగా అధికారం చెలాయించిన పార్టీయే రాష్ట్ర విభజన తరువాత ఇరు తెలుగు రాష్ట్రాలలోనూ నామమాత్రంగా మిగిలిన పార్టీ. ఔను కాంగ్రెస్ పార్టీ. రాష్ట్ర విభజన అనంతరం అటు తెలంగాణలోనూ, ఇటు ఏపీలోనూ కూడా ఆ పార్టీ అధికారానికి దూరమైంది. అంతే కాదు, ఇరు రాష్ట్రాలలోనూ ఆ పార్టీ ఉనికి మాత్రంగా మిగిలిపోయింది. అటువంటి పార్టీ రాష్ట్ర విభజన తరువాత దాదాపుగా దశాబ్దం తరువాత తెలంగాణలో పుంజుకుంది. తెలంగాణ ఇచ్చిన రాష్ట్రంలో ఆ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. ఇక ఇప్పుడు ఏపీ వంతు. అయితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ఒకింత అభిమానం ఉంది. అయితే విభజనకు ముందు ఆ పార్టీ చేసిన తాత్సారం, అవలంబించి వైఖరి కారణంగా తెలంగాణ ఇచ్చి కూడా దశాబ్దకాలం రాష్ట్రంలో ప్రతిపక్షంగానే మిగిలిపోయింది. అయితే తాజాగా తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది.
ఇక ఇప్పుడు ఏపీలో ఎన్నికలకు వేళయ్యింది. అయితే తెలంగాణలోలా ఏపీలో కాంగ్రెస్ పట్ల ప్రజా బాహుల్యంలో సానుకూలత ఇసుమంతైనా లేదు. తెలంగాణలో తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పాట్ల సానుకూలత ఉంటే, ఏపీలో మాత్రం తమ అభీష్ఠానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని రెండుగా ముక్కులు చేసిందన్న ఆగ్రహం జన బాహుల్యంలో బలంగా వ్యక్తం అవుతోంది. ఆ కారణంగానే రాష్ట్ర విభజన తరువాత జరిగిన రెండు ఎన్నికలలో కాంగ్రెస్ ఏపీలో జనం ఆ పార్టీని అసెంబ్లీలో అడుగుకూడా పెట్టనివ్వకుండా శిక్షించారు. పదేళ్ల తరువాత కూడా ఏపీ ప్రజలలో ఆ పార్టీ పట్ల ఆగ్రహం చల్లారలేదు. అటువంటి పరిస్థితుల్లో ఏపీలో ఆ పార్టీ పుంజుకోవడానికి షర్మిల రూపంలో ఒక ఆశ కనిపించింది.
ఏపీ జనం దివంగత సీఎం వైఎస్ రాజకీయ వారసుడిగా ఆయన కుమారుడు జగన్ కు 2019 ఎన్నికలలో ఒక చాన్స్ ఇచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు కట్టబెట్టారు. అయితే సీఎంగా ఆయన తీరు, ఆయన పాలనపై నాలుగున్నరేళ్లలోనే విసిగిపోయారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయా? ప్రభుత్వాన్ని గద్దె దించుదామా అని జనం ఎదురు చూస్తున్న పరిస్థితి ఇప్పుడు ఏపీలో నెలకొని ఉంది. అలాంటి సమయంలో ఏపీ కాంగ్రెస్ లోకి వైఎస్ తనయ షర్మిల అడుగుపెట్టనున్నది.
ఆమె ఏపీ కాంగ్రెస్ లోకి వస్తే.. ఏపీ కాంగ్రెస్ లో ఒక్క సారిగా నూతనోత్సాహం వస్తుందని కాదు కానీ.. అధికార వైసీపీ మాత్రం పూర్తిగా బలహీనపడుతుంది. ఏదో ఒక మేరకు కాంగ్రెస్ పుంజుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏపీలో వైఎస్ వారసుడిగా భావించి జగన్ పంచన చేరిన పూర్వ కాంగ్రెస్ వాదులంతా మళ్లీ కాంగ్రెస్ లోకి వలస వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. జగన్ పార్టీలో ఇమడ లేక, మరో మార్గం కానరాక పార్టీలోనే అనామకులుగా మిగిలిపోయిన మాజీ కాంగ్రెస్ నాయకులు ఒక్కరొక్కరుగా లేదా గంపగుత్తగా కాంగ్రెస్ లోకి వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి వస్తున్నారన్న వార్త ఇలా బయటకు వచ్చిందో లేదో అలా వైసీపీలో ఆందోళన తారస్థాయికి చేరుకుంది. ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామాను కూడా షర్మిల ఏపీ ఎంట్రీ ఖాతాలో వేసేస్తున్నారు. వైఎస్ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఓ వెలుగు వెలిగి ఇప్పుడు అనామకంగా జగన్ పార్టీలో కొనసాగుతున్న వారంతా కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంది.
అన్నిటికీ మించి ఇప్పటికే అధికార పార్టీలో 30 మందికి పైగా సిట్టింగులకు వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్లు అనుమానమేనన్న ప్రచారం జరుగుతోంది. అటువంటి వారిలో అత్యధికులు కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉంది. అంతే కాకుండా ఇప్పటికే తల్లినీ, చెల్లినీ దూరం పెట్టిన జగన్ ఇప్పుడు సోదరి తనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ తరఫున ప్రచారం చేపట్టడం ఆయనకు తీవ్ర నష్టం చేయడం ఖాయం. షర్మిల ఏపీ ఎంట్రీతో వైసీపీ తీవ్రంగా నష్టపోతుందని పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు. ఆ మేరకు కాంగ్రెస్ బలపడుతుందని చెబుతున్నారు. విజయం సాధించే పరిస్థితి ఉండకపోయినా విపక్షంగా ఎదిగే అవకాశం షర్మిల రాకతో కాంగ్రెస్ కు దక్కినట్లేనని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.