Leading News Portal in Telugu

Japan Fish: జపాన్‌లోని బీచ్‌లో వేల సంఖ్యలో చనిపోయిన చేపలు.. చూసి షాక్కు గురవుతున్న జనాలు


Japan Fish: జపాన్‌లోని బీచ్‌లో వేల సంఖ్యలో చనిపోయిన చేపలు.. చూసి షాక్కు గురవుతున్న జనాలు

జపాన్‌లోని హక్కైడో ప్రావిన్స్‌లోని హకోడేట్ తీరంలో శుక్రవారం ఉదయం వేల సంఖ్యలో చేపలు కొట్టుకురావడం కనిపించింది. ఇంత పెద్ద సంఖ్యలో చనిపోయిన చేపలను చూసి స్థానిక ప్రజలు ఖంగుతిన్నారు. కాగా.. ఆ చేపలను తినవద్దని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా.. చనిపోయిన చేపలను ఇంటికి తీసుకురావద్దని స్థానిక యంత్రాంగం ప్రజలను అభ్యర్థించింది. ఎందుకంటే ఈ చేపలు విషం వల్ల చనిపోయాయని చెబుతున్నారు. కాగా.. చనిపోయిన ఈ చేపల వీడియోకు సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో వేల సంఖ్యలో చనిపోయిన చేపలు కనిపించడంతో స్థానిక ప్రజలు, పర్యావరణవేత్తల్లో ఆందోళనలు పెరుగుతున్నాయి.

ఓ వార్త నివేదిక ప్రకారం.. చనిపోయిన చేపలలో ప్రధానంగా సార్డినెస్, కొన్ని మాకేరెల్ ఉన్నాయి. చనిపోయిన చేపల కారణంగా సముద్రపు నీరు సుమారు కిలోమీటరు వరకు తెల్లగా కనిపిస్తుంది. నీటిపై దుప్పటి పరిచినట్లుగా చనిపోయిన చేపలు కనిపిస్తున్నాయి. హకోడేట్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధకుడు తకాషి ఫుజియోకా మాట్లాడుతూ.. ఈ చేపలను పెద్ద ప్రెడేటర్ వెంబడించి ఉండవచ్చు, అందువల్ల ఆక్సిజన్ లేకపోవడంతో అవి అలసిపోయి.. చివరికి చనిపోయి ఒడ్డుకు కొట్టుకువచ్చాయని తెలిపారు. అంతేకాకుండా.. ఈ చేపలను తినే విషయంపై ఆయన మాట్లాడుతూ, ఈ చేపలు ఏ పరిస్థితుల్లో చనిపోయాయో తమకు ఖచ్చితంగా తెలియదని, అందుకోసం వాటిని తినమని సిఫారసు చేయనన్నారు.

ఇలాంటి ఘటనలు గతంలో జపాన్‌లో జరిగాయి. నివేదిక ప్రకారం.. గత సంవత్సరం జపాన్‌లో 5 సంవత్సరాల క్రితం హక్కైడోలోని వక్కనై నగరం సమీపంలో భారీ హిమపాతం తర్వాత కూడా ఇలాంటి సంఘటన జరిగింది. ఆ సమయంలో కూడా.. చనిపోయిన చేపల మరణానికి కారణం ఇప్పటికీ మిస్టరీగా మిగిలిపోయింది.