ఏపీ కాంగ్రెస్ లోకి షర్మిల? జగన్ కు ఇక కష్టకాలమే! | sharmila into ap congress| jagan| trouble| gidugu| apcc| chief| several| congress| leaders
posted on Dec 11, 2023 2:25PM
తెలంగాణలో సొంత కుంపటి పెట్టుకుని చక్రం తిప్పాలనుకున్న వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల.. సరిగ్గా ఎన్నికలకు ముందు పార్టీ తెలంగాణలో పోటీకి దూరం అని ప్రకటించి కాంగ్రెస్ నెత్తిన పాలు పోశారు. కాంగ్రెస్ కు మద్దతుగానే తమ పార్టీ పోటీ నుంచి వైదొలగుతుందని షర్మల చేసిన ప్రకటనతో వైఎస్సార్టీపీకి తెలంగాణలో నూకలు చెల్లినట్లైంది. ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దాదాపు పార్టీ అంతా రాజీనామా చేసింది. షర్మిల వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయకపోయినా.. పోటీ నుంచి కాంగ్రెస్ కు మద్దతుగా వైదొలగుతున్నట్లు చేసిన ప్రకటనతో అదే జరిగినట్లైంది. ఇక ఇప్పుడు షర్మిలకు తెలంగాణలో చేయడానికి ఏ పనీ లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత కూడా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ కంటే సమర్థులు, అనుభవజ్ణులూ ఉన్నారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు.. ఆమెను తెలంగాణ రాజకీయాల నుంచి దాదాపు దూరం చేసేసినట్లేనని పరిశీలకులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆమె కాంగ్రెస్ గూటికి చేరి.. తెలంగాణను వదిలి ఏపీలో రాజకీయాలు చేసుకోవలసిందేనని కూడా విశ్లేషిస్తున్నారు. కాగా వైఎస్సార్టీపీ కాంగ్రెస్ లో విలీనం అంటు పెద్ద ఎత్తున చర్చ జరుగుతన్న సమయంలోనే తెలుగువన్.. ఇక ఆమె రాజకీయ క్షత్రం ఏపీయే తప్ప తెలంగాణ అయ్యే అవకాశాలు ఇసుమంతైనా లేవని విస్పష్టంగా చెప్పింది.
ఇప్పుడు అదే జరగబోతోంది. ఆమె కాంగ్రెస్ గూటికి చేరి ఏపీలో పని చేయనున్నారు. ఈ విషయం ఇంకెంత మాత్రం ఊహాగానం కాదు. ఎందుకంటే ఏపీ పీసీసీ చీఫ్ గిడిగు రుద్రరాజు స్వయంగా షర్మిల ఏపీ కాంగ్రెస్ లో చేరనున్నట్లు తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ లో వైఎస్ షర్మిల కీలక పాత్ర పోషిస్తారని గుడుగు పేర్కొన్నారు. దీంతో ఇంత కాలం ఆమె ఏం చేసినా ఆమె టార్గెట్ మాత్రం ఏపీ సీఎం, తన సోదరుడు జగన్ మాత్రమేనని తేటతెల్లమైపోయింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా కర్నాటక సీఎం డీకే శివకుమార్ తో తెలంగాణలో వైఎస్సార్టీపీ విలీనం చర్చల సందర్భంగా చెప్పినట్లు రాజకీయవర్గాలలో చర్చ జరుగుతోంది. ఆ కారణంతోనే వైఎస్సార్టీపీని కాంగ్రస్ లో విలీనం ప్రతిపాదనను ఆమె కాంగ్రెస్ ముందుంచారని కూడా అంటున్నారు. అయితే వైఎస్సార్టీపీ విలీనం ప్రతిపాదన ద్వారా తెలంగాణలో తనతో కలిసి నడిచిన వారికి న్యాయం చేయాలన్నదే ఆమె ఉద్దేశం. అయితే ఆమె ప్రతిపాదనను తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆమె తెలంగాణలో పోటీ నుంచి కాంగ్రెస్ కు మద్దతుగా వైదొలిగారని విశ్లేషిస్తున్నారు.
సరిగ్గా ఆ సందర్భంలోనే తెలుగువన్.. షర్మిల తెలంగాణలో పోటీ నుంచి వైదొలిగి ఏపీలో కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషిస్తారనీ, పార్టీ అధ్యక్ష పగ్గాలను ఆమె చేపట్టినా ఆశ్చర్యం లేదనీ తెలుగువన్ చెప్పింది. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను గమనిస్తే అదే జరిగే అవకాశాలు ఉన్నాయనిపించక మానదు. షర్మిల కాంగ్రెస్ పార్టీ గూటికి చేరితే పార్టీ ఆమెను వైఎస్ వారసురాలిగా ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా వైసీపీలో జగన్ తీరు నచ్చకపోయినా గత్యంతరం లేక ఆ పార్టీలో కొనసాగుతున్న మాజీ కాంగ్రెస్ వాదులందరికీ షర్మిల చేరికతో సొంత గూటికి ద్వారాలు తెరిచినట్లౌతుంది. వైఎస్ వర్గంగా వారంతా షర్మిల నాయకత్వం కింద పని చేయడానికి ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశాలు ఉండవు. అదీ గాక ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ లో పదవులలో ఉన్నవారంతా నామ్ కే వాస్తే గా పదవులలో కొనసాగుతున్నవారే కానీ రాష్ట్రంలో పార్టీ పటిష్టతకు, బలోపేతానికి వారు చేసిందిగానీ, చేయగలిగింది కానీ ఏమీ లేదనే చెప్పారు. అదే గనుక ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ గూటికి చేరి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తే.. కాంగ్రెస్ శ్రేణులలో ఉత్సాహం రావడమే కాకుండా.. పార్టీ కార్యక్రమాలలో అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్న నేతలలో చురుకు పుడుతుంది. అదే సమయంలో పార్టీని వీడి ఇతర పార్టీలలో సర్దుకున్న వారంతా తిరిగి పార్టీ గూటికి చేరే అవకాశాలున్నాయి. ప్రజలలో కూడా వైఎస్ రాజశేఖరరెడ్డి పట్ల ఉన్న అభిమానం షర్మిల కారణంగా పార్టీకి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక జగన్ విషయానికి వస్తే తండ్రి మరణం తరువాత కాంగ్రెస్ తో విభేదించి సొంత పార్టీ పెట్టుకున్నారు. అప్పట్లో వైఎస్ కుటుంబం మొత్తం ఆయన వెన్నంటి నిలిచి వైఎస్ రాజకీయ వారసుడు జగనే అని చాటారు.
అయితే అధికార పగ్గాలు చేపట్టిన తరువాత ఆయన తీరుతో కుటుంబం మొత్తం ఆయనకు దూరమైంది. మరీ ముఖ్యంగా సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో జగన్ వ్యవహరించిన తీరు, ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి వత్తాసుగా వివేకా కుమార్తెను ఇబ్బందులకు గురిచేసిన సంఘటనలతో కుటుంబం జగన్ కు దూరమైంది. చివరకు సొంత తల్లి, చెల్లి కూడా ఆయనకు దూరం జరిగారు. అదే సమయంలో వివేకా హత్య కేసు దర్యాప్తు తీరుపై డాక్టర్ సునీత చేసిన, చేస్తున్న న్యాయపోరాటానికి షర్మిల మద్దతుగా నిలవడంతో వైఎస్ కుటుంబం షర్మిల వెనుక నిలిచారు. ఇక ప్రజలు కూడా వైఎస్ వారసుడిగా జగన్ ను చూడటం ఎప్పుడో మానేశారు. ఈ తరుణంలో షర్మిల కాంగ్రెస్ గూటికి చేరితే.. పార్టీకి దూరమైన అన్ని వర్గాలు, అలాగే వైఎస్ కుటుంబం కాంగ్రెస్ కు దన్నుగా మారే అవకాశాలున్నాయి. ఇది జగన్ కు రాజకీయంగా పూడ్చుకోలేని నష్టం చేకూర్చడం తథ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.