posted on Dec 11, 2023 2:23PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎల్ పి నేత జానారెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ ఎన్నికలలో జానారెడ్డి కుమారుడు కుందూరు జైవీర్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. జయవీర్ రెడ్డి నాగార్జునసాగర్ నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుత క్యాబినెట్లో ఏడు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ అనుభవం ఉన్న జానారెడ్డి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో హోమ్ మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. వివిధ మంత్రిత్వ శాఖలను నిర్వహించిన జానారెడ్డి అనుభవాలను రేవంత్ రెడ్డి వినియోగించుకోనున్నారని తెలుస్తోంది. తిరిగి తన క్యాబినెట్లో అవకాశం కల్పించాలని రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం. ఈ సందర్బంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డికి జానారెడ్డి శాలువాతో సత్కరించారు. జానారెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ట్రబుల్ షూటర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఎన్నికలకు ముందు అతనికి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. అసంతృప్తులను బుజ్జగించడానికి ఆయన నేతృత్వంలో నలుగురు సభ్యులతో కూడిన కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఎఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి మాణిక్ రావ్ ఠాక్రే, దీపాదాస్ మున్షీ, మీనాక్షి నటరాజన్ సభ్యులుగా ఉన్నారు. తెలంగాణలోని 119 నియోజకవర్గాలకు అసెంబ్లీ టికెట్ల కోసం దాదాపు వెయ్యి మంది కాంగ్రెస్ పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు. అయితే అసంతృప్తినేతలను బుజ్జగించడానికి కాంగ్రెస్ పార్టీ జానారెడ్డికి కీలక బాధ్యతలు అప్పగించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఎంఎల్ సి, కార్పోరేషన్ చైర్మన్ పదవులు, అవసరమైతే లోకసభ ఎన్నికలలో అవకాశం ఇవ్వనున్నట్లు జానారెడ్డి వారిని బుజ్జగించారు. కాంగ్రెస్ పార్టీని విజయతీరాలకు చేర్చడానికి జానారెడ్డి ఎనలేని సేవలందించారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కువగా గెలుపొందింది నల్గొండ జిల్లాలోనే. అదే జిల్లాకు చెందిన జానారెడ్డి కొత్త ప్రభుత్వంలో కొలువు తీరడానికి సిద్దం కానున్నారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వానికి తాను పూర్తిగా సహకరిస్తానని సోమవారం తనను కలిసిన విలేకరులతో జానారెడ్డి న్నారు. ఇటీవలె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ ని ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సంగతి తెలిసిందే.