Leading News Portal in Telugu

Gaza : గాజాలో యుద్ధంతో ఆకలికి అలమటిస్తున్న జనాలు


Gaza : గాజాలో యుద్ధంతో ఆకలికి అలమటిస్తున్న జనాలు

Gaza : గాజాలో భీకర యుద్ధం కొనసాగుతుంది. దీంతో తీవ్ర ఆహార కొరత ఏర్పడింది. సోమవారం రఫా సరిహద్దును దాటి గాజాలోకి ప్రవేశించిన సహాయక ట్రక్కులపై ఎగబడ్డ జనం అందినకాడికి సామగ్రిని ఎత్తుకుపోయారు. ఇజ్రాయెల్ దాడులు నిరాటంకంగా కొనసాగుతున్నందున గాజాలో మానవతా సహాయానికి తీవ్ర అంతరాయం కలుగుతోంది. దీంతో గాజా ప్రజలకు ఆహారం కూడా దొరకడం కష్టంగా మారింది. ఎక్కడ చూసినా జనాల ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. చివరకు తుపాకుల సాయంతో ట్రక్కులను తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇజ్రాయెల్ భీకర దాడుల కారణంగా గాజాలో లక్షలాది మంది ప్రజలు ఆహారం, నీరు, మందులు, కరెంటు కొరతతో దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నారు. కరెంటు, తిండితో పాటు గుక్కెడు మంచి నీరు కూడా దొరకక పౌరుల బతుకు దుర్భరంగా తయారైంది. ఫార్మసీ షాపుల్లో అత్యవసర మందులన్నీ నిండుకున్నాయి. నిత్యవసర సరకుల కోసం ఎక్కడ చూసినా భారీగా తొక్కిసలాట చోటు చేసుకుంటోంది. మానవతాసాయం ట్రక్కుల్లోని మంచి నీళ్ల బాటిళ్ల కోసం పెద్దలు, చిన్న పిల్లలు గుంపులుగా ఎగబడటం అక్కడి ప్రజల దుర్భర పరిస్థితికి అద్దం పడుతోంది.

యుద్ధం కొనసాగుతున్నందున గాజా జనాభాలో సగం మంది ఆకలితో అలమటిస్తున్నారని ఐక్యరాజ్యసమితి సీనియర్ సహాయ అధికారి ఒకరు తెలిపారు. అక్టోబరు 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్‌పై దాడి చేసి 1,200 మందిని చంపి, మరో 240 మందిని బందీలుగా పట్టుకున్నప్పటి నుండి గాజా అంతటా జనాల కదలికలు తగ్గిపోయాయి. దీంతో పాటు గాజా నుంచి రాకపోకలను ఇజ్రాయెల్ నిలిపివేసింది. ఇది వైమానిక దాడులను ప్రారంభించింది. గాజా ప్రజలు ఎక్కువగా ఆధారపడే సహాయ పంపిణీలను పరిమితం చేసింది. ఏడు వేలకు పైగా పిల్లలతో సహా 17,700 మందికి పైగా గాజా ప్రజలను ఇజ్రాయెల్ హతమార్చిందని హమాస్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఇప్పటివరకైతే ఈజిప్టు సరిహద్దులో ఉన్న రఫా క్రాసింగ్ మాత్రమే తెరిచారు. దీంతో గాజాకు పరిమితంగానే సహాయం అందుతోంది.