Leading News Portal in Telugu

Suryakumar Yadav: టీ20ల్లో చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్!


Suryakumar Yadav: టీ20ల్లో చరిత్ర సృష్టించిన సూర్యకుమార్ యాదవ్!

Suryakumar Yadav equals Virat Kohli’s Record: ‘మిస్టర్‌ 360’ సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత తక్కువ బంతుల్లో రెండు వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. కేవలం 1163 బంతుల్లో సూర్య ఈ ఫీట్‌ అందుకున్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో మిస్టర్‌ 360 ఈ ఘనత అందుకున్నాడు. లిజాడ్ విలియమ్స్ వేసిన ఐదో ఓవర్‌ నాలుగో బంతిని సింగిల్ తీసిన సూర్యకుమార్ టీ20ల్లో 2000 పరుగులు పూర్తి చేశాడు.

సూర్యకుమార్ యాదవ్ 56 ఇన్నింగ్స్‌ల్లో 2000 పరుగులు పూర్తి చేశాడు. దాంతో రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. విరాట్ కూడా 56 ఇన్నింగ్స్‌ల్లోనే 2000 పరుగులు చేశాడు. ఈ జాబితాలో పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజామ్ అగ్రస్థానంలో ఉన్నాడు. బాబర్ 52 ఇన్నింగ్స్‌ల్లో 2000 పరుగులు బాదాడు. మహమ్మద్ రిజ్వాన్ కూడా 52 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఫీట్ అందుకున్నాడు. ఈ జాబితాలో టీమిండియా బ్యాటర్ కేఎల్ రాహుల్ (58)ను సూర్య వెనక్కినెట్టాడు.

అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. సూర్య 59 ఇన్నింగ్స్‌ల్లో 2,041 రన్స్ చేశాడు. ఈ జాబితాలో విరాట్ కోహ్లీ టాప్‌లో ఉన్నాడు. విరాట్ 107 ఇన్నింగ్స్‌ల్లో 4008 రన్స్‌ చేశాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 140 ఇన్నింగ్స్‌ల్లో 3853 రన్స్ చేయగా.. లోకేష్ రాహుల్ 68 ఇన్నింగ్స్‌ల్లో 2256 పరుగులు బాదాడు. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ 36 బంతుల్లో 56 రన్స్ చేశాడు.