Leading News Portal in Telugu

మే తరువాతే పంచాయతీ ఎన్నికలు?! | panchayat elections after may| bc| reservationa| supreme| verdict| general


posted on Dec 13, 2023 8:48AM

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇక వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగుతుందని అంతా భావించారు. అయితే రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. గ్రామ పంచాయతీల సర్పంచ్ ల పదవీ కాలం జనవరి 31తో ముగియనుండటంతో.. వెంటనే వాటి నిర్వహణకు రంగం సిద్ధమౌతుందని అంతా భావించారు. అయితే రిజర్వేషన్లు ఖరారు కాకపోవడం, గడువు ముగిసేలోగా అంజే జనవరి 31 లోగా రిజర్వేషన్లు ఖరారయ్యే అకాశాలు లేకపోవడంతో గ్రామ పంచాయతీలకు ఇప్పట్లో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో పంచాయతీలలో అధికారుల పాలన అనివార్యంగా కనిపిస్తోంది.  

 బీసీ రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో పంచాయతీ ఎన్నికలను మే తర్వాతే నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు.  సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన ప్రకారం రాష్ట్ర బీసీ కమిషన్లు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రాజకీయ వెనుకబాటుతనాన్నిఅధ్యయనం చేసి అందుకు అనుగుణంగా రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంటుంది.   ఎన్నికల్లో అమలైన రిజర్వేషన్లు కాకుండా  కొత్తగా రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉంటుంది.  

అయితే ఇప్పటివరకూ రాష్ట్ర బీసీ కమిషన్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి నివేదికా అందలేదు. ఫలితంగా బీసీ రిజర్వేషన్లపై స్పష్టత రాలేదు. బీసీ కమిషన్  నివేదిక అందిన తర్వాత మాత్రమే రిజర్వేషన్లు ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు నిర్వహణపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది.  రిజర్వేషన్ విషయంలో డీలిమిటేషన్ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే కావడంతో ఆ  ప్రాసెస్ మొదలు కావడానికి సమయం పడుతుంది. ఇలా ఉండగా రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎప్పుడైనా నిర్వహించేందుకు రెడీగా ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పేర్కొంది.  

ఇక అన్నిటికీ మించి సార్వత్రిక ఎన్నికలు మార్చిలో జరిగే అవకాశాలున్నాయన్న వార్తల నేపథ్యంలో స్థానిక ఎన్నికల నిర్వహణకు లోక్‌సభ ఎన్నికలు అడ్డు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వో తదితర అధికారులు లోక్‌సభ ఎన్నికలకు సమాయత్తమౌతున్న నేపథ్యంలో  సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ వాయిదా పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. 

నిర్దిష్ట డెడ్‌లైన్ ప్రకారం జనవరి 31తో సర్పంచ్, వార్డు సభ్యుల పదవీకాలం ముగియనున్నందున ఆ తర్వాత వారు ఆ పదవుల్ల కొనసాగడానికి అవకాశం లేదు. దీంతో ఎన్నికలు జరిగి కొత్త ప్రజాప్రతినిధులు కొలువుదీరేంత వరకు ప్రత్యేక అధికారుల పాలన అనివార్యమని పరిశీలకులు అంటున్నారు.